శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 6 ఆగస్టు 2020 (14:31 IST)

క్వారంటైన్ కేంద్రం నుండి పరారైన మర్డర్ కేసు కరోనాపాజిటివ్ నిందితుడు, ఎక్కడ?

కరోనావైరస్ పోలీసులకు కొత్త కష్టాన్ని తెచ్చి పెట్టింది. ఒక ప్రక్క కరోనా సోకి కొంతమంది పోలీసులు బాధపడుతంటే మరో ప్రక్క కరోనా సోకిన ఖైదీలను పారిపోకుండా ఆపడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఇక అలాంటి ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్నది. కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్న ఒక మర్డర్ కేసు నిందితుడు క్వారంటైన్ కేంద్రం నుండి తప్పించుకొని పారిపోయాడు.
 
ఇటువంటి ఘటనలు పోలీసులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఒక నూడిల్స్ బండి యజమానిని మర్డర్ చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే అతనికి కరోనా సోకడంతో కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
 
నిన్న సాయంత్రం నుండి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న నిందితుడు రాత్రి 10 గంటల సమయంలో క్వారంటైన్ కేంద్రం నుండి తప్పించుకొని పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తప్పించుకొన్న నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సమీపంలోని లింగపల్లి గ్రామానికి చేందినవాడని పోలీసులు తెలిపారు.
 
తప్పించుకున్న నిందితుడు కరోనా బాధితుడు కావడంతో అతని ద్వారా కరోనా ఎంతమందికి సోకుతుందోన్న భయాందోళనల మధ్య పోలీసులు తీవ్ర గాలింపు చర్యను చేపట్టారు.