గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (12:49 IST)

తెలంగాణ సచివాలయాన్ని పలకరించిన కరోనా.. ఇద్దరికి పాజిటివ్

తెలంగాణ సచివాలయాన్ని కరోనా పలకరించింది. తెలంగాణ సెక్రటేరియట్ బీఆర్కే భవన్‌ 7వ అంతస్తులో ఉన్న ఆర్థికశాఖలో పని చేసే ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిద్దరూ తండ్రీకొడుకులు అని తెలిసింది. ఈ మధ్యే వీళ్లు బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చారు. తాజాగా వీరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో శాంపిళ్లు తీసి, పరీక్షలకు పంపారు. 
 
సోమవారం ఫలితాలు రావడంతో సెక్రటేరియట్ మొత్తం ఉలిక్కిపడింది. ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది హోం క్వారంటైన్‌కి వెళ్లారు. సోమవారం సాయంత్రం బీఆర్కేభవన్‌లోని ఏడో అంతస్తును శానిటైజ్‌ చేశారు. బీఆర్కేభవన్‌ పక్కనే ఉన్న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ కరోనా కేసు నమోదైంది.
 
నాలుగో అంతస్తులో పనిచేసే ఓ ఉద్యోగి(38)కి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతడి భార్య ఓ ప్రభుత్వాస్పత్రిలో నర్సుగా పనిచేస్తోందని తెలిసింది. ఆమెకు లక్షణాలు లేకపోవడంతో... వైరస్‌ ఎలా వ్యాప్తిచెందిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 
 
తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి కాన్వాయ్‌లో గన్‌మన్‌గా పనిచేస్తున్న ఓ ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. అతడు మంత్రి కాన్వాయ్‌లో ఉంటాడే తప్ప ఆయనతో ఎలాంటి కాంటాక్టులు లేవని తెలిసింది.