కరోనా వైరస్.. రికార్డు స్థాయిలో మృతులు.. ఒకే రోజు 331 మంది మృతి
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన అనంతరం దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. గతవారం రోజులుగా దేశంలో నిత్యం 9వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.
గడచిన 24గంటల్లోనే అత్యధికంగా 9987 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన అనంతరం ఒకేరోజు అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో కొవిడ్-19 మహమ్మారికి బలి అవుతున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది.
తాజాగా సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331మంది మృత్యువాత పడ్డారు. ఒకే రోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. మంగళవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,66,598కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
వీరిలో ఇప్పటివరకు 7466మంది మృత్యువాతపడ్డట్లు పేర్కొంది. మొత్తం బాధితుల్లో 1,29,215 మంది కోలుకోగా మరో 1,29,917 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.