బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రతరం కావడంతో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నందున అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం అంతటా భారీ నుండి అతి భారీ వర్షపాతం కురిపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
గురువారం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ ప్రకారం, అల్పపీడన ప్రాంతం గురువారం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయువ్య దిశగా కదులుతుంది. ఆ తరువాత శుక్రవారం ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉత్తరం వైపు కదులుతుంది.
విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరిక కేంద్రం కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రాబోయే కొద్ది రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఈ కాలంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.