శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (16:21 IST)

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. భారీ వేగంతో కూడిన గాలులు.. అలెర్ట్

బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోంది. 4.5 కిలో మీటర్లు ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతోంది.
 
తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఉత్తర ఇంటిరియర్‌ కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. 
 
దీంతో రాగల 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్రా తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం.. దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు. 
 
కోస్తా ఆంధ్రా, యానం, తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ చెబుతోంది. 
కాగా నేడు, రేపు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 
 
ఇంకా బుధవారం రాత్రి తూర్పు గోదావరి- విశాఖపట్నం వద్ద తీరం దాటే సూచనలున్నాయి. గంట‌కు 50 నుంచి 60 కిలో మీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన గాలులు వీస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్  సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపింది. దీనికోసం ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.  
 
ఇంకా అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో తాళ్లరేవు-కాకినాడ మ‌ధ్య తీరం దాటే సూచ‌న‌లు
 కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం  సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంట‌ల మ‌ధ్య ఈ వాయుగుండం తీరం దాటనుంది.

వేగంతో కూడిన బ‌ల‌మైన గాలుల కారణంగా తీరం దాటే స‌మ‌యంలో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకుండా సుర‌క్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు చెప్పారు. తీరం దాటే స‌మ‌యంలో గాలుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పేర్కొంది.