బలహీనపడిన వాయుగుండం.. ఏపీకి తప్పిన ముప్పు
బంగాళాఖాతంలో కొనసాగుతూ వచ్చిన వాయుగుండం బలహీనపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొంచివున్న తుఫాను ముప్పు తప్పిపోయింది. అయితే రాగల 24 గంటల్లో పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం ఈ వాయుగుండం దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతూ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అదేసమయంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించివున్న ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కారణంగా రాబోయే రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, అల్పపీడనం ప్రభావంతో దక్షిణాంధ్ర, ఉత్తర తమిలనాడు తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరు జిల్లాలు అతలాకతలమవుతున్నాయి. కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా నెల్లూరులో గురువారం వరకు భారీ వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ తెలిపింది.