మంగళవారం, 16 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2025 (15:46 IST)

వైకాపా సర్కారులో ప్రతి ఉద్యోగానికి - బదిలీకి ఓ రేటు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

pawan kalyan
గత వైకాపా ప్రభుత్వ హయాంలో పంచాయతీ రాజ్ శాఖలో ప్రతి ఉద్యోగానికి, ప్రతి బదిలీకి ఓ రేటు నిర్ణయించారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, తమ హయాంలో కేవలం సీనియారిటీ, సిన్సియారిటీలను కొలమానంగా తీసుకుని ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులతో ఆయన బుధవారం చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లెల కోసమే పంచాయతీ రాజ్ శాఖను తీసుకుని, పదేపదే సమీక్షలు నిర్వహించి సమస్యలను ఒక్కొక్కటిగా కొలిక్కి తెస్తున్నట్టు తెలిపారు. 
 
పంచాయతీరాజ్‌ శాఖలో పదోన్నతులు ఇవ్వకపోవడం సరికాదనిపించింది. గత ప్రభుత్వంలో ప్రతి పోస్టుకు, బదిలీకి ఓ రేటు పెట్టారు. ఈ పద్ధతిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పాను. పనులు చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపు చేయాలని ఆదేశించినట్టు గుర్తు చేశారు.
 
పంచాయతీరాజ్‌ అనుబంధ శాఖల్లో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారనీ, వీరికి సీనియారిటీ, సిన్సియారిటీ, పనితీరు ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని అధికారులకు చెప్పినట్టు వెల్లడించారు. పైగా, మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సులు కూడా ఆ పరిధిలో ఉంటేనే చెప్పాలని సూచించాను. 10 వేల మందికి పదోన్నతులు కల్పించాం. పదోన్నతి వచ్చిన ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుందని ఆయన చెప్పారు. 
 
అదేసమయంలో ఉద్యోగుల వేతనాలు ఇంకా పెరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి. ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి పెట్టాలి. సీనియర్ ఐఏఎస్ అధికారులు శశిభూషణ్‌ కుమార్‌, కృష్ణతేజ, వెంకటకృష్ణ వంటి అధికారుల కృషి ప్రశంసనీయం. నా తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగే.. అందుకే ఉద్యోగులపై సానుకూల భావన ఉందని పవన్ కళ్యాణ్ మరోమారు గుర్తుచేశారు.