శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (08:57 IST)

అగ్మెంటెడ్ రియాలిటీ డిజిటల్ టెక్నాలజీతో బాపు మ్యూజియం అభివృద్ధి

విజయవాడ నగరంలో ఉన్న బాపు మ్యూజియం ఎన్నో చారిత్రకమైన వస్తువులు, పురావస్తు శిల్పకళ సంపద లక్షల సంవత్సరాల చరిత్రకు పాక్షిగా విలిచే పురాతన వస్తువులతో ప్రత్యేకతను సంతరించుకుందని రాష్ట్ర ఆర్కియాలజీ మరియు మ్యూజియంల కమిషనర్ డా. జి.వాణిమోహన్ పేర్కొన్నారు.

బాపు మ్యూజియం ఆవరణలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో డిడి ఆర్కియాలజీ స్వామి నాయక్‌తో కలిసి వాణిమోహన్ మాట్లాడుతూ ఈ మ్యూజియంలో ఎంతో విలువైన అరుదైన సుమారు 1500లకు పైగా వస్తువులు ప్రదర్శనకు ఉన్నాయన్నారు.

ఆయా వస్తువులను 7 గ్యాలరీలలో భద్రపరచడం జరిగిందని, ఆదిమానవుడు నుండి 19వ శతాబ్దపు ఆధునిక మానవుడు ఉపయోగించిన వస్తువులు కళాఖండాలు, వస్త్రాలు, వంట సామాగ్రి, తదితరాలు ఎన్నో భద్రపరచడం జరిగిందన్నారు.

పురావస్తువుల‌కు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం జోడించి డిజిటల్ ప్లాట్ ఫారంతో ఈ మ్యూజియాన్ని అనుసంధానం చేసామన్నారు. 10 లక్షల సంవత్సరాల చరిత్రకు నిదర్శనంగా నిలిచే బాపు మ్యూజియాన్ని ప్రజలు తప్పనిసరిగా సందర్శించాలని, నగరానికి మ్యూజియం ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు.

బాపు మ్యూజియం యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి స్మార్ట్ ఫోన్ కలిగినవారు డౌన్ లోడ్ చేసుకుని ఆచిత్రాలను స్కాన్ చేస్తే వాటి చరిత్రను మాటలు ద్వారా తెలుపుతాయన్నారు. అంతేకాకుండా వాస్తవంగా అవి ఉండే ప్రాంతాల విశేషాలను కూడా మాటలు ద్వారా తెలియజేయడం ఈ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత అన్నారు.

ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గురువారం బాపు మ్యూజియాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. 1962 సంవత్సరంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని విక్టోరియా జూబ్లీ మ్యూజియంగా పురావస్తు ప్రదర్శన శాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

1921లో జాతీయ కాంగ్రెస్ సమావేశం ఈ భవనంలోనే జరిగిందని, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య మహాత్మాగాంధికి జాతీయ పతాకాన్ని అందజేస్తున్నారు.

ఈ సమావేశంలో జాతీయ నాయకులైన మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్, లాలా లజపతిరాయ్, బాబూ రాజేంద్రప్రసాద్, టంగుటూరి ప్రకాశం పంతులు, సరోజిని నాయుడు వంటి ఎందరో మహానీయులు పాల్గొన్నారన్నారు.

బాపు మ్యూజియం ప్రాంగణంలో అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్, మ్యాపింగ్ థియేటర్, డిజిటల్ బుక్, ఇంటరాక్టివ్ కేబినెట్ డిస్ ప్లే, డిజిటల్ వాల్ ప్యానల్, ఇంటరాక్టివ్ కియోస్కో లు వంటి 7 గ్యాలరీలు ఏర్పాటు చేసామన్నారు.

మ్యూజియాన్ని ఉన్నత ప్రమాణాలు, నాణ్యత, అత్యధిక కాలం మన్నికతో ఉండేలాగా కొరియన్ షీట్‌తో మ్యూజియంలో కాబినెట్‌లను రూపొందించామ‌న్నారు. ఆంధ్రుల వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించే దిశలో మన సంస్కృతి, వారసత్వం ఘనతను చాటుకునేలా ప్రొజక్షన్ మ్యాపింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.