శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (20:39 IST)

భక్త జన సందోహంతో కిట‌కిట‌లాడుతున్న పున్నమీ ఘాట్

క‌లియుగ దైవం శ్రీనివాసుని నిత్యోత్స‌వాలు, క‌ళ్యాణోత్స‌వాలు భవానీపురం పున్నమి ఘాట్‌లో కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజురోజుకు భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది.

నగరం నలుమూలల నుండే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో తరిస్తున్నారు. భూలోక వాసులకు ముక్తిమార్గం చూపేందుకు చతుర్భుజుడై సూర్యబింబ కాంతులతో ప్రకాశిస్తూ కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృష్ణానది తీరాన పున్నమి ఘాట్‌లో భక్తులను కటాక్షిస్తున్నారు.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి,  శ్రీదేవి, భూదేవి సమేతుడై పవిత్ర కృష్ణానదీ తీరాన కొలువుతీరి భ‌క్తుల‌తో కల్యాణోత్సవాన్ని జరిపించుకుంటున్నారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో గరిమెళ్ళ  నానయ్య చౌదరి (నాని) పర్యవేక్షణలో శ్రీవారి కళ్యాణోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి.

బుధవారం స్వామివారి కళ్యాణోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. సుప్రభాత సేవతో మొదలై విశ్వరూప దర్శనం, తోమాల సేవ, కొలువు, సహస్ర నామార్చనలతో అంగరంగ వైభవంగా స్వామివారికి పూజాధికాలు నిర్వహించారు. ఉదయం 6 నుండి 8 గంటల వరకు యాగ శాలలో మహా శాంతి హోమం నిర్వహించారు.

మొదటి గంట నివేదన అనంతరం సర్వ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం 9 గంటలకు వారాంతపు సేవల్లో భాగంగా కళ్యాణ మండపంలో 1008 కలశాలతో అత్యంత సుందరంగా సహస్ర కలశాభిషేకం పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు కలిశ పూజ‌లో పాల్గొన్నారు.

అనంతరం కళ్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, కె.బి.యన్ కళాశాల నిర్వాహకులు చలవాది మల్లికార్జునరావు దంపతులు 1008 కలశాలతో ఏర్పాటు చేసిన సహస్ర కలశాభిషేకం, శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

ఉదయం 10 గంటలకు త్రిదండి అష్టాక్షరి సంపత్‌కుమార్ రామానుజ జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. స్వామివారి వైభవాన్ని వివరించారు. సాయంత్రం నాలుగున్నర గంటల నుండి కళా వేదిక దగ్గర శ్రీ కనకదుర్గ లలితా పారాయణ బృందం, గ్రంధి రాధిక, రాము గార్లచే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణం జరిగింది.

అనంతరం కళావేదికపై అన్నమాచార్య కీర్తనలతో పాటు ఉంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవ ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆకెళ్ళ విభీషణ శర్మచే వెంకటాచల మహత్యంపై ప్రవచన కార్యక్రమం జరిగింది. అనంతరం విద్యుత్తు దీప కాంతులతో తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్న ఈ కార్యక్రమాన్ని గరిమెళ్ళ నానయ్య చౌదరి (నాని), దూపగుంట్ల శ్రీనివాస‌రావు, పామిడి లక్ష్మీ వెంకట శ్రీనివాసరావు, ఉదయగిరి శ్రీనివాస్‌బాబు, కట్ట అరుణ్‌బాబు, రెడ్డి ఉమామహేశ్వరి గుప్తా, చింతలపూడి రఘురాం, పూర్ణచంద్రరావు, బాలగంగాధర్, పట్నాలు నరసింహారావు తదితరులు పర్యవేక్షించారు.