శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (08:30 IST)

జగన్‌ చేతిలో బొమ్మగా డీజీపీ: యనమల

కరోనాను మించిన జగన్‌ వైరస్‌ విధ్వంసం వల్లే ఎన్నికలు వాయిదా పడిందని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యానికి డీజీపీనే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ చేతిలో డీజీపీ సవాంగ్‌ తోలు బొమ్మగా మారారని విమర్శించారు.

డీజీపీని తప్పించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. తప్పు చేసిన అధికారులతో సహా ప్రోత్సహించినవారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 15 రోజుల్లో రెండుసార్లు హైకోర్టులో నిలబడిన డీజీపీ..సవాంగ్‌ మాత్రమేనన్నారు. వైసీపీ గుండాల దాడులపై చోద్యం చూసిన అధికారులపై చర్యలు చేపట్టాలని యనమల చెప్పారు.
 
బెదిరించి ఏకగ్రీవం చేసుకుంటే అది గెలుపా?: కోట్ల సుజాతమ్మ
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై టీడీపీ మహిళా నేత కోట్ల సుజాతమ్మ స్పందించారు. ఎన్నికల ప్రక్రియలో వైసీపీ నేతల దౌర్జన్యాన్ని ఆమె ఖండించారు. పులివెందుల సంస్కృతిని రాష్ట్రం మొత్తం తీసుకొచ్చారని సుజాతమ్మ మండిపడ్డారు. బిహార్ కంటే దారుణంగా వైసీపీ కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

బెదిరించి ఏకగ్రీవం చేసుకుంటే అది గెలుపా అని ప్రశ్నించారు. వైసీపీ రంగులు మార్పు, ఫ్లెక్సీల తొలగింపుపై కోర్టు ఆదేశాలు పాటించలేదని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎన్నడూ చూడలేదన్నారు. ఆలూరులో దౌర్జన్యాలపై కోర్టుకెళ్తామని కోట్ల సుజాతమ్మ తెలిపారు.
 
ఎన్నికల ప్రక్రియను జగన్‌ అపహాస్యం చేశారు: దేవినేని
వైసీపీ అరాచక పాలనపై దేశమంతా చర్చ జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కలెక్టర్‌, ఎస్పీలను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఓడితే రాజీనామాలు తప్పవని మంత్రులను సీఎం బెదిరించారని చెప్పారు. జగన్‌ ప్రభుత్వ అక్రమాల్లో కొన్నింటినే ఈసీ బయటపెట్టిందన్నారు.

ఎన్నికల ప్రక్రియను జగన్‌ ప్రభుత్వం అపహాస్యం చేసిందని విమర్శించారు. నామినేషన్ల విత్ డ్రాపై ప్రత్యర్థులను ప్రలోభపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్‌ గింజుకుంటున్నారని తెలిపారు. కేంద్రం, పక్క రాష్ట్రాలు కరోనాపై యుద్ధం చేస్తుంటే ఏపీలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని దేవినేని ఉమ ప్రశ్నించారు.