మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 13 మే 2021 (21:18 IST)

కట్నంకోసం భార్యను వేధిస్తున్న సీఐడీ అధికారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోరా?

రాష్ట్రంలో మహిళల పరిస్థితి దారుణంగా తయారైందని, సామాన్యమహిళలతోపాటు, ప్రముఖులకు అవమానాలు, వేధింపులు తప్పడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి వాపోయారు. గురువారం ఆమె తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవిలోఉన్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తనను వేధిస్తున్నాడని, ఆయన సతీమణి అరుణకుమారి చెప్పడం జరిగిందన్నారు.

తన భర్తే తనను వరకట్నంకోసం వేధిస్తున్నాడని, ఆమె ఫిర్యాదు చేస్తే ఇంతవరకు దానిపై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. భార్యను వేధిస్తున్న వ్యక్తికి ముఖ్యమంత్రి ఉన్నత పదవులుకట్టబెట్టి తన కార్యాలయంలో ఉంచుకోవడం బాధాకరమని సంధ్యారాణి వాపోయారు. ప్రభుత్వం పెట్టిన మహిళా పోలీస్ స్టేషన్లు అలంకారప్రాయంగా మారాయన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి భవానీ వాటిని ప్రారంభించిన రోజునే మహిళాపోలీస్ స్టేషన్లో కేసు పెడితే, దాన్ని నమోదు చేయలేదన్నారు. అసెంబ్లీలో హోంమంత్రే కేసు నమోదు కాలేదని సమాధానం చెప్పారంటే పరిస్థితి ఎంత హీనంగా ఉందో అర్థమవుతోందన్నారు. మహిళా శాసన సభ్యురాలికే రక్షణకల్పించలేని ప్రభుత్వం, సామాన్యమహిళలను ఆదుకుంటుందంటే ప్రజలు ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా అని సంధ్యారాణి ప్రశ్నించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీనేతలు, కార్యకర్తలచేత మహిళలకు అవమానాలు, వేధింపులు, అత్యాచారాలు ఎదురవు తున్నా, ఆఖరికి హత్యగావింపబడుతున్నా కూడా ఈ ముఖ్యమంత్రి తనకేమీ పట్టనట్టే ఉంటున్నాడన్నారు. సీఐడీ అధికారి సునీల్ కుమార్ పైన ముఖ్యమంత్రి  తక్షణమే ఏంచర్యలు తీసుకుంటారో చెప్పాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు.