సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (08:49 IST)

పథకాలు అమలులో ఏ ఒక్కరికీ అన్యాయం జరగవద్దు: జగన్‌

ప్రభుత్వ పథకాలన్నీ సంతృప్తికర స్థాయిలో అమలు కావాలని, అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగవద్దని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే, పథకాల అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇదివరకే చెప్పామని, వెంటనే వాటన్నింటినీ పరిష్కరించి, అర్హత ఉన్నవారికి పథకాలను వర్తింప చేయాలని సీఎం ఆదేశించారు. వెంటనే వారి వారి ఖాతాల్లో నగదు బదిలీ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం ఈ ఆదేశాలిచ్చారు. 

రాష్ట్రంలో వివిధ పథకాలు ఎలా అమలవుతున్నాయన్న దానిపై సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. సీఎంఓ అధికారులతో సమావేశమైన ఆయన, ప్రతి పథకం పూర్తి సంతృప్తికర స్థాయిలో అమలు కావాలని చెప్పారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గత జూన్‌లో వివిధ పథకాలు అమలు చేశామని, కోవిడ్‌ కష్టకాలంలో ఆదుకునేందుకు ఏడాది ముగియక ముందే, అమలు తేదీలను ముందుకు జరిపి మరీ పథకాలు అమలు చేశామన్నారు. ఆ సందర్బంలో జాబితాలో తమ పేరు లేకపోతే ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోమని చెప్పామన్నారు. ఆ దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు అందించాలని సీఎం స్పష్టం చేశారు. 
 
గత నెలలో(జూన్‌) ఏయే పథకాలు?
గత నెల 4వ తేదీన ‘వైయస్సార్‌ వాహనమిత్ర’, 10న ‘జగనన్న చేదోడు’, 20వ తేదీన ‘వైయస్సార్‌ నేతన్న నేస్తం’, 24న ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకాలను ప్రభుత్వం అమలు చేసింది. వాహనమిత్ర పథకాన్ని నాలుగు నెలలు ముందుగా, నేతన్న నేస్తాన్ని ఆరునెలలు ముందుగా ప్రభుత్వం అమలు చేసింది. 
 
వైయస్సార్‌ నేతన్న నేస్తం
వైయస్సార్‌ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికీ రూ.24వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. గత ఏడాది డిసెంబరులో ఈ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది, కోవిడ్‌ కష్టాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగో లేనప్పటికీ ఆరు నెలలు ముందుగా అమలు చేసింది.

గత డిసెంబరు తర్వాత మగ్గం పెట్టుకున్న వారినీ పరిగణలోకి తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఏడాది జూన్‌ 20న పథకం అందలేదని భావించిన వారు ఎవరైనా ఉంటే, వారి దరఖాస్తులను కూడా పరిశీలించి నేతన్న నేస్తం కింద రూ.24వేల చొప్పున అందించాలని సీఎం ఆదేశించారు.