రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న వీటి విషయంలో ఎక్కడా నిధులకు కొరత రాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు.
నిధుల అనుసంధానంపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను పెట్టుకుని కచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్దేశించిన వివిధ శాఖల్లో చేపట్టిన కార్యక్రమాల పురోగతి, వాటికి చేస్తున్న ఖర్చు, సమీకరించాల్సిన నిధులు విషయంలో సీఎం అధికారులతో సమగ్రంగా సమీక్ష చేశారు.
ముఖ్యమంతి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక, విద్య, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బి, జలవనరులశాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
విద్యా రంగంలో నాడు–నేడుపై సీఎం సమీక్ష:
విద్యా రంగంలో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష చేశారు. ఇప్పటి వరకూ విడుదల చేసిన నిధులు, ఇకపై సమీకరించాల్సిన నిధుల అంశాలపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మొదటి విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు అవుతుందని, ఇప్పటికి రూ.920 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు.
మిగిలిన నిధుల విడుదల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 కల్లా మొదటి విడత నాడు–నేడు కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు.
అలాగే పాఠశాలలు సహా, హాస్టళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశామని అ«ధికారులు సీఎంకు తెలిపారు.
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలకు.. నిధుల పరంగా ఇబ్బందులు రాకుండా, పటిష్టంగా ఈ కార్యక్రమం కొనసాగాలని సీఎం ఆదేశించారు. రెండు, మూడో విడత పనుల కోసం ఖర్చయ్యే రూ.7700 కోట్ల నిధుల విషయంలో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలన్నారు.
వచ్చే ఏడాదిన్నర కాలంలో అన్ని స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని, ఏడాదిన్నర కాలంలో పాఠశాలల అభివృద్ధి విషయంలో మనం కన్న కలలు నిజం కావాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
వైద్యం – ఆరోగ్య రంగం:
– 16 కొత్త మెడికల్ కాలేజీలు, 1 సూపర్ స్పెషాల్టీ, 1 క్యాన్సర్ ఆస్పత్రి, 1 మానసిక చికిత్సాసుపత్రి కోసం రూ. 6657 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా
– అలాగే ప్రస్తుతం ఉన్న 11 ఆస్పత్రులు, 6 అనుంబంధ సంస్థలు, 7 మల్టీ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల కోసం మరో రూ.6099 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా
– ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.1,236 కోట్లు ఖర్చు
– అలాగే పీహెచ్‌సీల్లో కొత్త వాటి నిర్మాణం, ఉన్న వాటి పునరుద్ధరణ కోసం రూ.671 కోట్లు ఖర్చు కాగలదని అంచనా
– విలేజ్ క్లినిక్స్‌లో 11,197 కేంద్రాల పునరుద్ధరణ మరియు కొత్త వాటి నిర్మాణం కోసం రూ.1745 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు.
– వీటికి నిధుల అనుసంధానంపైనా సీఎం అధికారులతో చర్చించారు.
– ఇప్పటికే నిధులు సమకూరిన వాటి పనులు వేగవంతం చేయాలని, మిగతా వాటికి నిధులు అనుసంధానం చేసుకుని ప్రణాళికతో ముందుకుసాగాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సాగునీటి ప్రాజెక్టులు:
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న, చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.98 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. వీటిలో రూ.72 వేల కోట్ల కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయన్నారు. వీటిపైనా సీఎం సమీక్ష చేశారు.
రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ఉద్దేశించిన పనుల కోసం ఖర్చు చేసే నిధుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలో దీనికి సంబంధించి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబరు 1 నుంచి రాయలసీమ కరువు నివారణ పనులు ప్రారంభం కావాలని, టెండర్లు వీలైనంత త్వరగా ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు.
రాయలసీమ కరువు నివారణ పనులతో పాటు, స్టేట్ వాటర్ సెక్యూరిటీ డెవలప్‌మెంట్ (పోలవరం నుంచి వరద జలాల తరలింపు), ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ–తాగునీటి వసతి కల్పన, కృష్ణా–కొల్లేరు ప్రాంతం ఉప్పు నీటిమయం కాకుండా చేపట్టాల్సిన పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సీఎం ఆదేశించారు.
పంచాయతీ రాజ్ విభాగంలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులపైనా సీఎం సమీక్ష చేశారు. దీనికి ఏఐఐబీ ఆర్థిక సహాయం చేస్తోంది. మొత్తం రూ.4,456 కోట్లతో మారుమూల గ్రామాలకు రోడ్లను వేస్తున్నారు. ఇప్పటికే 70శాతం టెండర్లు ఖరారై పనులు కొనసాగుతున్నాయని, మిగిలిన 30శాతం పనులకు త్వరలోనే టెండర్లు ఖరారుచేస్తామని చెప్పారు.
అలాగే పట్టణాభివృద్ధిశాఖ 50 మున్సిపాల్టీల్లో చేపడుతున్న తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల పనులపై సీఎం సమీక్ష చేశారు. రూ. 5,350 కోట్లతో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఏఐఐబీతో నిధుల అనుసంధానం జరిగిందని అధికారులు వెల్లడించారు. రెండు ప్యాకేజీలకు సంబంధించి, రూ.1950 కోట్ల విలువైన పనులకు త్వరలోనే టెండర్లు ఖరారుచేస్తామన్నారు. ఏఐఐబీ దీనికి నిధులు సమకూరుస్తోందని తెలిపారు.
రోడ్లు–భవనాల శాఖలో భాగంగా ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు’తో చేపట్టిన ప్రాజెక్టులను కూడా సీఎం సమీక్షించారు. తొలిదశలో భాగంగా దాదాపు రూ.3200 కోట్లను దీని కోసం ఖర్చు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 3,104 కి.మీ రహదారులు, 479 బ్రిడ్జిలు నిర్మించనున్నారు.
మొదటి విడత పనులకు సంబంధించి 50శాతం డీపీఆర్‌లు తయారు అయ్యాయని, మిగిలినవి కూడా పూర్తవుతాయని తెలిపారు. వీటికీ టెండర్లు ఖరారుచేస్తామని సీఎంకు అధికారులు వెల్లడించారు.
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు :
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీటిని అందించే ప్రయత్నాల్లో భాగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. తొలిదశలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, తూ.గో, ప.గో, గుంటూరులోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, కడప జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకోసం రూ.19,088 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
దీనికి సంబంధించి నిధుల అనుసంధానంపై సీఎంకు వివరించారు. నిధుల సమీకరణ టై అప్ జరిగిందని తెలిపారు. వీటితోపాటు కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని 7 నియోజకవర్గాలతో పాటు, డోన్ నియోజకవర్గంలో కూడా వాటర్ గ్రిడ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు.
అలాగే ప్రకాశం జిల్లాలోని మిగిలిన పశ్చిమ ప్రాంతంలోనూ, అనంతపురం జిల్లాలోనూ వాటర్ గ్రిడ్ పనులు చేపట్టాలని సీఎం అన్నారు. వీటికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధంచేసి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైబ్రీడ్ యాన్యునిటీ (హెచ్.ఎ.ఎం.) విధానంలో చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులకు అక్టోబరు టెండర్లు ఖరారు చేస్తామని, ఆవెంటనే వర్క్ ఆర్డర్లు ఇస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.