ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:51 IST)

దళారులు మాటలను విశ్వసించవద్దు: మంత్రి బొత్స

సచివాలయ వ్యవస్థకులో మరో పదహారు వేల పోస్ట్‌ల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలు అత్యంత పారదర్శకంగా, పకడ్భందీగా నిర్వహిస్తున్నామని, దళారుల మాటలు నమ్మరాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... "సీఎం వైయస్ జగన్ పల్లెల్లోకే పరిపాలన రావాలని దేశంలోనే నూతనంగా సచివాలయ వ్యవస్థకు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. కోవిడ్ నేపథ్యంలోనూ సచివాలయ వ్యవస్థ ప్రజలకు అండగా నిలిచింది. గత ఏడాది సుమారు 1.50లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రస్తుతం మిగిలిన మరో పదహారు వేల పోస్ట్‌ల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలు అత్యంత పారదర్శకంగా, పకడ్భందీగా నిర్వహిస్తున్నాం.

దీనిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫెరెన్స్‌ల ద్వారా సమన్వం చేస్తున్నాం. అభ్యర్ధులు ఎటువంటి అపోహలకు గురి కావద్దు. అర్హత వున్న వారికి, ప్రతిభావంతులకే ఉద్యోగాలు వస్తాయి. మద్యవర్తులు, దళారులు చెప్పే మాటలను విశ్వసించవద్దు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతల ప్రకారమే ఈ ఉద్యోగాలకు పరీక్ష రాసే అవకాశం వుంటుంది. కొన్ని పోస్ట్‌లకు నిర్థిష్టమైన అర్హతలు లేకపోయినా కొందరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే నిర్థిష్టమైన అర్హతలు లేకపోతే వారికి హాల్‌ టిక్కెట్లు రావు. హార్టీకల్చర్, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్ట్‌లు ఎక్కువగా వుంటే, అర్హత వున్న వారు తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీని విషయంలో అర్హతలను తగ్గించాలనే డిమాండ్‌ సరికాదు" అన్నారు.
 
పంచాయతీరాజ్‌ శాఖామంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మాట్లాడుతూ.... "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశా నిర్దేశాల ప్రకారం రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతిరహితంగా వారి గుమ్మం వద్దకే  అందచేయటానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఏడాది  అక్టోబర్ 2 నుంచి  అమలులోకి వచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ తన సేవల ద్వారా జాతీయ, అంతర్జాతీయ మన్ననలు అందుకుంది. 

రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలు పనిచేస్తున్నాయి. గత ఏడాది  ప్రభుత్వం మొత్తం 1,26,728  ఉద్యోగాలకు  పోటీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, విజయవంతగా  నిర్వహించింది. మొదటి విడత నిర్వహించిన పరీక్షల ద్వారా 1,10,520 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇంకా గ్రామ, వార్డు సచివాలయాల్లో 13 శాఖల్లో 16,208 ఖాళీ పోస్టులు మిగిలిపోయాయి. వీటి భర్తీ కోసం జనవరి 10, 2020 న నోటిఫికేషన్ జారీ చేశాం.

ఇందులో గ్రామ సచివాలయ పోస్ట్‌లు14,062 కాగా వార్డు సచివాలయ పోస్ట్‌లు 2,146 వున్నాయి. ఈ పోస్ట్‌ల కోసం 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఖాళీల భర్తీ కోసం ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. మొత్తం 14 రకాల పరీక్షలను నిర్వహిస్తున్నాం. 
 
20వ తేదీన అంటే తొలిరోజున  ఉదయం, మధ్యాహ్నం కలిపి మొత్తం  6,81,664 మంది  హాజరు కానున్నారు.  మొదటి రోజు ఉదయం 2,221 కేంద్రాలు, మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి  సర్వం సిద్ధం చేశాం. ఒఎంఆర్ షీట్లు, ప్రశ్న పత్రాలు ఉంచడానికి 13 జిల్లాల హెడ్ క్వార్టర్లలో స్ట్రాంగ్ రూంల ఏర్పాటు చేశాం. పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించటానికి రాష్ట్ర వ్యాప్తంగా 806 రూట్లను ఏర్పాటు చేసి ప్రతీ రూట్ కు ఒక గెజిటెడ్ అధికారిని నియమించటం జరిగింది.

పరీక్షల నిర్వహణ నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. అన్ని జిల్లాలలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశాం. 13 జిల్లాల నుండి స్ట్రాంగ్ రూమ్ లకు సంబంధించిన సిసి టివి లైవ్ ఫీడ్ ను రాష్ట్ర స్థాయి నుండి కూడా పర్యవేక్షిస్తున్నాం.
 
రాష్ట్రస్థాయిలో డి.జి.పి, జిల్లాస్థాయిలో ఎస్.పి ల నేతృత్వంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టటం జరిగింది.  స్ట్రాంగ్ రూముల వద్ద, పరీక్షా కేంద్రాలు, ఓఎంఆర్ ప్రింటింగ్ కేంద్రాలు, పంపిణీ చేసే  సమయంలో  స్కానింగ్ సెంటర్ల వద్ద కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేశాం. 24 x 7 సిసి కెమెరాల నిఘా, సాయుధులైన భద్రత సిబ్బంది పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూంల నిర్వహణ వుంటుంది. సంబ౦ధిత పరీక్షలకు అవసరమైన ఒఎంఆర్ షీట్లు అన్ని జిల్లాలకు చేరాయి. 
 
పరీక్షల నిర్వహింహణలో 77,558 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాస్థాయి అధికారులను సమన్వయం చేయడానికి ఎప్పటికప్పుడు సిఇఒలు, జెడ్ పిపిలు, డిపిఒలు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహిస్తున్నాం. పరీక్షా కేంద్రాలకు సరిపడినంత  సంఖ్యలో బస్సులను ఆర్టీసి ద్వారా నడిచేలా చర్యలు తీసుకుంటున్నాం.

అలాగే ప్రైవేటు రవాణా వాహనాలు కూడా ప్రత్యామ్నాయంగా నడిచేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కోవిడ్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య శాఖతో  పస్ట్ ఎయిడ్ సదుపాయాల  (ప్రధమ చికిత్స) ఏర్పాటు చేస్తున్నాం.

ప్రతి అభ్యర్థి మాస్క్ ధరించడం తప్పనిసరి. కోవిడ్ పాజిటీవ్ వున్న వారికి ప్రత్యేక ఐసోలేషన్ గదులను, పిపిఇ కిట్‌లతో ఇన్విజిలేటర్లను, సదరు గదిలో వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా 6.99 లక్షల మంది అభ్యర్ధులు హాల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంకా సమయం వున్నందున అభ్యర్థులు హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. 
  
హార్టీకల్చర్, వెటర్నరీ అసిస్టెంట్‌ల పోస్ట్‌లకు దరఖాస్తు చేసిన వారికి నిర్ధేశించిన విద్యార్హతలు వున్న వారికే హాల్ టిక్కెట్లు వస్తాయి. నిర్ధేశిత అర్హతలు లేని వారు తమకు హాల్‌ టిక్కెట్లు రావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇస్తున్నారు. ఇంకా ఎవరికైనా పరీక్షల సమాచారంపై అనుమానాలు వుంటే హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశాం. 
 
విద్యార్ధులంతా పరీక్షా సమయానికి కనీసం ఒక గంట ముందే చేరుకోవాలి. తరువాత ఒక నిమిషం ఆలస్యమయినా అభ్యర్ధులను పరీక్ష హాలు లోకి అనుమతించటం జరగదు. కోవిడ్ 19 నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పరీక్షల నిర్వహణ జరుగుతుంది. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ 19 నిబంధనల  ప్రకారం భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలి.

పరీక్ష కేంద్రం యొక్క ప్రతీ ప్రవేశ ద్వారం వద్ద  ధర్మల్ స్కానర్ తప్పనిసరి. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద తగినంత మంది  వైద్య సిబ్బంది, సాధారణ మందులు, కోవిడ్ చికిత్సకు అవసరమైన మందులు, పల్స్ ఆక్సిమీటర్లతో కూడిన ప్రథమ చికిత్స వస్తు సామగ్రి అత్యవసర అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచుతున్నాం" అన్నారు.