శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:54 IST)

జియో సంస్థ సేవా భావంతో వ‌చ్చింది... అదీ రాజకీయమేనా?

టీటీడీ జారీ చేసిన అక్టోబర్‌ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జియో సంస్థ సబ్‌ డొమైన్‌లో విడుదల చేయడంపై సామాజిక మాధ్యమాల్లో సాగిన దుష్ప్రచారం పట్ల టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు. జియో సంస్థ సేవా భావంతో ముందుకొచ్చిందని, ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరమన్నారు. జియో క్లౌడ్‌ పరిజ్ఞానం ద్వారా గంటన్నర వ్యవధిలోనే 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలు కల్పించామని చెప్పారు.
 
దర్శన టికెట్ల బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు జియో సంస్థ దాదాపు రూ.3 కోట్లు విలువైన సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాలను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. అయితే కొన్ని చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. వచ్చే నెలలో పూర్తిగా టీటీడీ డొమైన్‌లోనే దర్శన టికెట్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. 
 
టీటీడీ విడుదల చేసిన అక్టోబర్‌ నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌కు సంబంధించి దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. టికెట్ల కోసం భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. ఆయన తిరుమల అన్నమయ్య భవనంలో విలేకరులతో మాట్లాడారు.