ఈరోజు తెల్లవారుజామున పరమపదించిన ఈశ్వర్‌గారి జీవితంలో ఎన్నో అనుభూతులు, మంచి, చెడులు చోటుచేసుకున్నాయి. కానీ తన జన్మ సార్థకం అయినందనీ, ఇంతకంటే ఏమి కావాలంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దానికి కారణం శ్రీవేంకటేశ్వరస్వామిని కనులారా వీక్షించడమే. ఒకటా రెండా రోజులతరబడి ఆ విశ్వమూర్తి ఎదురుగా కూర్చునే అవకాశం కలిగింది. ఈ విసయాన్ని ఆయన తన సినీపోర్టర్ అనే పుస్తకంలో నిక్షిప్తించారు. ఆ వివరాలు పాఠకులకోసం.
1999లో ఒక రోజున సప్తగిరి పత్రిక ఎడిటర్ రామ్మూర్తిగారు ఈవో వి.వి. వినాయక్‌గారు పిలుస్తున్నారని తిరుపతికి తీసుకెళ్ళారు. ఆయన మమ్మల్ని ఆహ్వానించి, ఇప్పుడెందుకు పిలిచానంటే, 1950లో డి. రాఘవరావుగారు వేసిన స్వామివారి కేలండర్నే ఇంతకాలం ప్రిట్ చేయిస్తూ వచ్చాం. అదే కేలండర్. కానీ ఇప్పుడిక నేత్ర దర్శనం, అర్చనానంతరం దర్శనం, పూలంగి సేవా దర్శనం ఇలా ప్రతి దర్శనం ఒక్కొక్క కేలండర్ లీఫ్‌గా ప్రింట్ చేయాలనుకున్నాం.మీరు నేత్ర దర్శనంతో పెయింటింగ్ ప్రారంభించాలి అన్నారు.
నేత్రదర్శనం అంటే!
నేత్రదర్శనం అంటే ఏమిటి? అని అడిగితే, ఇ.వో.గారు ఇలా సమాధానం చెప్పారు. నేత్ర దర్శనం ప్రతి గురువారం మాత్రమే వుంటుంది. మీరు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి రాత్రి ఎనిమిది గంటల వరకు మూల విరాట్ దగ్గర కూర్చుని అన్ని వివరాలు గమనించండి. అవసరమైన స్కెచ్‌లు గీతసుకోండి.. అని వివరిస్తూ, ఓ లెటర్ నా కిచ్చి ఈ ఉత్తరాన్ని కొండమీ శేషాద్రికి చూపిస్తే అన్ని ఏర్పాట్లు చేస్తాడని తెలిపారు.
అలా గురువారం మొదలు పెట్టాను. స్వామివారి పాదాల ముందున్న `కులశేఖరపడి` (మొదటి గడప) వద్ద కూర్చేంటే డ్రాయింగ్ వేసుకోవడానికి అనుకూలంగా వుంటుంది. రండి. అని చెప్పి భక్తులకు అడ్డం కాకుండా పక్కగా కూర్చుని మీపని మీరు చేసుకోండని` సెలవిచ్చారు.
అలా ప్రారంభించాను. మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో మాత్రం గంటసేపు బయటకు వచ్చేవాడిని. స్కెచ్‌లు వేయడానికి వెలుతురు సరిపోకపోయినప్పుడల్లా అక్కడున్న దీపాలకు నూనెపోసి, వత్తులు ఎగదోసి అర్చన స్వాములు నాకు పూర్తిగా సహకరించారు. అలా స్వామివారి మూల విరాట్‌కు ఐదు అడుగుల దూరంలో కూర్చుని ఉన్నప్పుడు నేను ఎక్కడలేని ఉద్వేగానికి లోనయ్యేవాణ్ణి. ఈ అపురరూప అవకాశం దొరికినందుకు నా జన్మ ధన్యమైందని ఆనందపడ్డాను.
ఇక అక్కడ ఒక్కోసారి భక్తులు విసిరే కానుకలు, నాణాలు నా వీపుకు తాకినప్పుడల్లా నా ఒళ్ళు జలదరించేది. భక్తి పారవస్యంతో భగవన్నామస్మరణ చేసి మైమరిచిపోయేవాడిని. నేను కూర్చున్న పాదాల సన్నిధి అలనాడు అన్నమయ్యలాంటి వాగ్గేయకారులెందరో నర్తించి కీర్తించి, ముక్తిని పొందిన పవిత్ర స్థలం. ఇలా ఎన్నో అనుభూతులు.
నల్లపిల్లి వచ్చేది
అక్కడ నేను డ్రాయింగ్ వేస్తున్నంతసేపు ఒక నల్లటి పిల్లి వచ్చి నా పక్కన కూర్చోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆతృత తట్టుకోలేక అక్కడి అర్చలకులను `ఈ పిల్లి విషయం ఏమిటి?` అని అడిగాను. వారు ఏం చెప్పారంటే, ఇప్పటికి నాలుగుసార్లు రెండు కొండలకవతల వదిలివేసి వచ్చినా తెల్లారేసరికి ఇక్కడే ప్రత్యక్షమౌతుంది ఈ విషయం ఈవోగారికి చెబితే, దాన్ని వదిలేయండి. దానికిష్టం వచ్చినప్పుడు వచ్చి పోనివ్వండి.. అని చెప్పారట. ఆ పిల్లి గర్భగుడి అంతా తిరుగుతూ రాత్రిళ్ళు శఠారి పెట్టి వుంచే వెండి పీఠం మీద నిద్రపోతుంది. ఇది చూశాక. ఏదో జన్మలో స్వామివారితో బంధం అనిపించింది.
ట్విస్ట్ ఏమంటే...
ఆ తర్వాత నెలలో ఈవో వినాయక్‌గారు ట్రాన్స్‌ఫర్ కావడంతో కొత్తగా వచ్చిన ఐవి. సుబ్బారావుగారు నేత్ర దర్శనాన్ని కేలండర్‌గా ప్రింట్ చేస్తే అది ప్రతి ఇంటికీ చేరుతుందనీ, అపవిత్ర స్థలంలో నేత్ర దర్శనం ఉండడం మంచిదికాదన్నారు. అంతేకాక మహాశక్తివంతమైన స్వామివారి దృష్టి ప్రజలకు మేలుకంటే కీడు చేసే ప్రమాదముందని దాన్ని కేలండర్‌గా ప్రింట్ చేయడం ఆపేసి, దేవస్థానం మ్యూజియంలో పెట్టించినట్లు తెలిసింది.
అది కేలండర్ రూపంలో బయటకు రాకపోయినా నేను స్వామి సన్నిధిలో పరవశుణ్ణయ్యే భాగ్యాన్ని కల్పించింది. ఇంతకన్నా జీవితంలో ఏం కావాలి? అంటూ తెలిపారు ఈశ్వర్‌గారు.