ప్రతి ఫలమూ బీసీలకు అందిస్తా : బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
చెట్లెక్కే వెనుబడిన తరగతులకు చెందిన తమ వారి చేత పార్లమెంట్ మెట్లెక్కించారని, ఆ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర వెనుబడిక తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ కొనియాడారు.
వెనుబడిన తరగతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు అలుపెరగని కృషి చేస్తానని, ఆయనందించే ఫలాలను బీసీలందరికీ అందిస్తానని అన్నారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రగా సచివాలయంలోని రెండో బ్లాక్ లో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ, ఎంతో నమ్మకంతో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా తనను సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారన్నారు. ఇది తన పూర్వజన్మ సుకృతమని, సీఎం నమ్మకాన్ని వమ్ముచేయకుండా బీసీల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
తన సుదీర్ఘ పాదయాత్రలో వెనుకబడిన కులాల వెతలను సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లతో చూశారని, నేడు మనస్సుతో బీసీల కష్టాలకు పరిష్కారాలు చూపుతున్నారని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వెనుబడిన తరగతుల ప్రజలకు ఆర్థిక, విద్య ఫలాలు జగనన్న పాలనలో అందుతున్నాయన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి అందించే ప్రతి ఫలమునూ బీసీలకు అందిస్తానన్నారు. చెట్లక్కే బీసీల చేత పార్లమెంట్ మెట్లెక్కించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. బీసీ మహిళలకు కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రాధాన్యతనివ్వడం కాకుండా వివిధ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం పదవులిచ్చిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డేనని అన్నారు.
52 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయించారన్నారు. ఇప్పటికే 24 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయగా, కొత్తగా మరో 28 కార్పొరేషన్లను త్వరలో ప్రారంభించనున్నారని మంత్రి వెల్లడించారు.
అంతకుముందు వేదపండితుల మంత్రోచ్ఛారణాల నడుమ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బాధ్యతలు చేపట్టారు. కర్నూల్ జిల్లా బేతంచర్ల బీసీ బాలుర రెసిడెన్సియల్ స్కూల్, డోన్ బీసీ బాలికల రెసిడెన్సియల్ స్కూల్ ను జూనియల్ కళాశాలలుగా అప్ గ్రేడ్ ఫైల్ పై మంత్రిగా తన తొలి సంతకాన్ని ఆయన చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కమిషనర్ బి. రామారావు, కాపు కార్పొరేషన్ ఎండి సుబ్రహ్మణ్యం, బీసీ కార్పొరేషన్ ఎండి భీమ్ శంకర్, ఎమ్మెల్యే ధనలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు అనంత ఉదయ్ భాస్కర్ తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.