ఏపీలో 18న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
ఏపీలో 12 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ఈనెల 18వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికపై ఆదేశాలిచ్చింది. 14వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.
మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికపై సమావేశానికి సంబంధించి ఆ రోజు ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకు జిల్లా కలెక్టర్ ఫారం-2 ద్వారా నోటీసులు సర్వ్ చేస్తారు. ఈనెల 18న ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాలేదు.
అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ పదవి అన్‌రిజర్వ్‌డ్. మేయర్ పీఠం కావడంతో అందరి దృష్టీ కార్పొరేషన్‌పైనే ఉంది. అధికార పార్టీ వైసీపీ నుంచి మొదట్లో ఎన్నో పేర్లు వినిపించినా.. చివరికి వచ్చేసరికి రెండు మాత్రమే ప్రధానంగా వినిపిస్తున్నాయి.
టీడీపీ సైతం మేయర్ పదవిని దక్కించుకుంటామనే ధీమాలో ఉంది. ఈనెల 14న ఫలితాలు వెలువడనుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనే విషయంపై ఎవరి అంచనాల్లో వారున్నారు.
మేయర్ పదవి జనరల్ కావటంతో డిప్యూటీ మేయర్ మాత్రం ముస్లింగానీ, బీసీ సామాజికవర్గానికి గానీ దక్కవచ్చనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా కొత్తపాలక వర్గం ఏర్పాటవడానికి ఎక్కువరోజులు పట్టవనేది సుప్పష్టం.