ప్రశ్నించే గొంతుకలను గెలిపించండి : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సర్కార్‌ను ప్రశ్నించే గొంతుకలైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టభద్రులను కోరారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మిగార్డెన్స్‌లో పట్టభద్రులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పట్ల చిత్త శుద్ది ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. ఉద్యమంలో వందలాది విద్యార్ధులు ఆత్మ బలిదానాలకు చలించి హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ బాగుపడుతుందని భావిస్తే నేడు నలుగురు వ్యక్తుల చేతిలో బందీ అయ్యిందని మండిపడ్డారు. 4కోట్ల మంది ప్రజల నోట్లో మట్టి కొట్టి కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. తప్పకుండా ఇలాంటి టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉందన్నారు.
మండలిలో ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటే మిగిలిన రెండేళ్లు అయిన టీఆర్ఎస్ సర్కార్ ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేస్తుందన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో 77 అసెంబ్లీ స్థానాలు ప్రభావితం అవుతాయని కాబట్టి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఆరేళ్లుగా యూనివర్సిటీలకు వీసీలు లేకున్నా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్కసారి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. తమ స్వప్రయోజనాల కోసం పట్టభద్రుల సమస్యలను గాలికి వదిలారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ గెలిపిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి పైసల రాజేశ్వర్ రెడ్డిగా మారాడని కేసీఆర్ డబ్బుల బ్యాగు మోసే గుమాస్తా పనులు చేస్తాడని ఎద్దేవా చేశారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కోట్లాడిన వ్యక్తే రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారని వివరించారు. కాబట్టి రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో గెలిపించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్కసారి కూడా ఉద్యోగులు, యువత సమస్యలపై ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. తన స్వలాభం కోసం కేసీఆర్ కుటుంబానికి తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి లాభాలు చేకూరే ప్రాజెక్టులకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని కట్టాల్సింది పోయి బాగున్న సచివాలయాన్ని కూలగొట్టి వెయ్యి కోట్లు వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 31వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ 1.30లక్షా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మాయమాటలతో కేటీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా 1.93 లక్షల ఉద్యోగాలు ఖాళీల ఉన్న వాటిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరమన్నారు.
ఓట్లను కొని ఎన్నికల్లో గెలవడం టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. కేసీఆర్ అనే మోసగాడు ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అరచేతిలో బెల్లం చూపించి మోచేతిని నానించే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. పట్టభద్రులను మోసం చేస్తున్న టీఆర్ఎస్, కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే 33 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగ సంఘ నేతలు సర్కార్‌కు అమ్ముడుపోయి వారికి కొమ్ముకాస్తున్నాడని విమర్శించారు. ఎప్పుడు లేని విధంగా పీఆర్సీ కమీషన్ 7.5 శాతం జీతాలు పెంచాలంటూ ఉద్యోగులను అవమానించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 22 శాతం తక్కువ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉద్యోగులకు న్యాయం జరగలన్న.. యువతకుఉద్యోగాలు రావాలన్న ప్రశ్నించేగొంతును మండలిలోకి పంపాలన్నారు. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి రాముల నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.