1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (20:58 IST)

రేషన్‌ షాపుల్లో రద్దీ ఉన్న చోట అదనపు కౌంటర్లు

రాష్ట్రంలో రేషన్ కార్డు కల్గిన 1.47 కోట్ల కుటుంబాలకు 1,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం ద్వారా లబ్ధి చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించిందని, తదనుగుణంగా ఇప్పటి వరకు 1.258 కోట్ల కార్డులకు రూ.1258 కోట్లు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి మరియు కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అదేవిధంగా రేషన్ సరుకులు 1.47 కార్డుదారులకు 1.29 కోట్ల మందికి పంపిణీ చేసామని తెలిపారు. కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో నిరుపేద, అసంఘటిత రంగానికి చెందిన దినసరి కూలీలు, వలస కూలీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటివద్దే ఉచిత రేషన్, ఆర్థిక సాయం అందించి వారికి అండగా నిలుస్తుందన్నారు.

లాక్ డౌన్ వల్ల రేషన్ కార్డు కల్గిన వారు ఇబ్బందులు పడకుండా ఉండడానికి మార్చి 29 నుంచి నెల వ్యవధిలోనే 3 విడతలుగా రేషన్‌ సరుకులు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి వారికి సక్రమంగా అందేలా చేస్తుందన్నారు.

పేదలకు కడుపు నింపే క్రమంలో ఏ ఒక్క లబ్ధిదారుడు  కరోనా బారిన పడకూడదనే సదుద్దేశ్యంతో తాజాగా రేషన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రేషన్ షాపుల వద్ద క్యూలు పెరగకుండా లబ్ధిదారులకు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయిస్తూ వాలంటీర్ల ద్వారా టైమ్ స్లాట్ తో కూడిన టోకెన్ లు అందజేసిందన్నారు.

కూపన్లపై రేషన్‌ షాపు, తేదీ, సరుకులు తీసుకునే సమయం వంటి వివరాలు తెలపడంతో లబ్ధిదారులు ఆ సమయానికి వస్తే సరిపోతుందన్నారు. ఈ నిర్ణయంతో రేషన్ షాపుల వద్ద గమిగూడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రేషన్ పంపిణీ కేంద్రాల వద్ద క్యూలైన్ లో మూడు మీటర్లు దూరం పాటించే విధంగా మార్కింగ్ చేసి భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టిందన్నారు.

కేటాయించిన నిర్ణీత సమయానికి ఆయా లబ్ధిదార్లు వచ్చి తమ రేషన్ తీసుకుపోతుండటంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం తీసుకువచ్చిన టోకెన్ వ్యవస్థ సత్పలితాలనిచ్చిందని ప్రముఖులు కొనియాడుతున్నారన్నారు. 

రాష్ట్రంలోని మొత్తం 29,620 రేషన్‌ షాపుల్లో ఎక్కువ కార్డులు ఉన్న చోట రద్దీని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే ఉచితంగా రేషన్‌ కార్డులకు బియ్యం, శనగలు అందిస్తోందన్నారు. 

మరోవైపు ఆకస్మాత్తుగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కొంతమంది తమ తమ ప్రాంతాలకు, స్వగ్రామాలకు దూరంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి ఒక్కరూ తాము ఉన్న ప్రాంతాల్లోనే ఉచిత రేషన్ పొందేందుకు ప్రభుత్వం ముందస్తు కసరత్తు చేసిందన్నారు.

దీనితో తాము వేరే ప్రాంతాల్లో ఉండిపోవడంతో తమకు అందాల్సిన రేషన్ అందలేదనే పరిస్థితి లేకుండా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లోనే రేషన్ అందే విధంగా లబ్ధిదారులకు టోకెన్‌లు అందజేసిందని తెలిపారు. కరోనా వైరస్‌ వల్ల రెడ్‌ జోన్‌గా ప్రకటించిన చోట్ల సురక్షిత ప్రాంతంలో సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

రెడ్ జోన్ నేపథ్యంలో ప్రజలు రేషన్ కోసం గుమిగూడితే మరింత ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల సేవలను మరోసారి ఉపయోగించుకుందన్నారు. ఈ ప్రాంతాల్లో వాలంటీర్లే స్వయంగా ఇంటింటికీ వెళ్లి రేషన్ అందజేయడంతో కరోనా ప్రభావం లేకుండా రెడ్ జోన్ ప్రాంతాల్లో సైతం రేషన్ పంపిణీ చేయడంలో ప్రభుత్వ అధికారుల సమన్వయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ప్రభుత్వం తీసుకున్న ముందస్తు ఏర్పాట్లతో అర్హులకు రేషన్ పంపిణీ సజావుగా సాగుతోందని సమాచార శాఖ కమీషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.