ఏపీలో పెన్షన్ డబ్బుల పంపిణీలో నకిలీ నోట్ల కలకలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి ఒకటో తేదీన అర్హులైన వృద్ధులకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛను డబ్బులను పంపిణీ చేసింది. వలంటీర్లు శనివారమే డబ్బులు విత్ డ్రా చేసుకుని ఆదివారం ఉదయం నుంచి ఈ పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే, ఈ పింఛను డబ్బుల్లో నకిలీ నోట్లు కనిపించాయి. ఇవి కలకలం సృష్టిస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాళెం గ్రామంలో 38 రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి పెంచిన పింఛన్లు ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. దీంతో భాగంగా, నరసాయపాళెం గ్రామం ఎస్సీ కాలనీలో వాలంటీర్ పింఛను పంపిణీ చేసేందుకుగాను శనివారం యర్రగొండపాళెంలోని ఓ బ్యాంకులో డబ్బును డ్రా చేశాడు.
ఆదివారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేసి వెళ్లిన తర్వాత నకిలీ నోట్లు ఉన్నట్టు లబ్ధిదారులు గుర్తించి వలంటీరుకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న డబ్బుల్లో కూడా నకిలీ నోట్లు ఉన్నట్టు గ్రహించాడు. అలా మొత్తం రూ.19 వేలు విలువ చేసే రూ.500 నకిలీ నోట్లను గుర్తించిన వలంటీరు అధికారులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులో నకిలీ నోట్లు ఎలా వచ్చాయన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.