శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (18:05 IST)

వర్మ, నాకు మధ్య అరమరికలు తొలగాయి అందుకే డేంజరస్ విడుదల : నట్టి కుమార్

Naina Ganguly, Apsara Rani
Naina Ganguly, Apsara Rani
కంపెనీ పతాకంపై  రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ దర్వకత్వంలో రూపొందించిన తాజా సినిమా "డేంజరస్". దీనికి "మా ఇష్టం" అన్నది ఉపశీర్షిక. అందాల తారలు నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్లుగా నటించగా, ముఖ్య పాత్రలలో రాజ్ పాల్ యాదవ్, మిథున్ పురంధర్ కనిపిస్తారు. తెలుగు, హిందీ, తమిళ భాషలకు సంబందించిన ఈ సినిమా ట్రైలర్ ను శనివారం హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. అనంతరం దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, మూడు భాషలలో డిసెంబర్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, "నా సినిమాలలో మరో కొత్త కోణం ఈ సినిమా. హీరో, హీరోయిన్లతో వేలాది సినిమాలు వచ్చాయి. దానికి భిన్నంగా ఇద్దరు అమ్మాయిల  మధ్య ప్రేమ కథతో దీనిని మలిచాం. మగవాళ్ళతో వారిద్దరు ఎలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారన్న నేపథ్యంలో రొమాంటిక్, క్రైమ్, యాక్షన్, సస్పెన్స్  అంశాలతో సాగే సినిమా ఇది. హీరోల డేట్స్ దొరక్కపోయినా హీరోయిన్స్ తో కూడా సినిమాలు చేయవచ్చునని  చెప్పేవిధంగా ఈ సినిమా ఉంటుంది" అని అన్నారు.గతంలో తాను తీసిన సినిమాల రీ రిలీజ్ గురించి అడిగిన ప్రశ్నకు వర్మ బదులిస్తూ,  కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నామని, అందుకు సంబందించిన ప్రాసెస్ జరుగుతోందని చెప్పారు. ఫ్యామిలీ స్ ఈ సినిమాను  చూడరేమోనన్న అభిప్రాయాన్ని ఓ పాత్రికేయుడు వ్యక్తంచేయగా, ఫ్యామిలీస్ అంతా కలసి చూడకపోయినా ఒక్కొక్కరు వేరు వేరుగా చూస్తారని వర్మ బదులిచ్చారు.
 
ఈ సినిమాను  తనకు చెందిన విశాఖ టాకీస్ డిస్ట్రిబ్యూషన్ తరపున విడుదల చేస్తున్న నట్టి కుమార్ మాట్లాడుతూ, కొన్ని కారణాలతో ఈ సినిమా విడుదలను తాను అడ్డుకున్న మాట వాస్తవమేనని, కానీ వర్మ, నాకు మధ్య అరమరికలు అన్నీ తొలగిపోవడంతో ఇకపై ఇద్దరం కలసి సినిమాలు చేయదలచుకున్నామని తెలిపారు. రొమాన్స్ మాత్రమే కాదని, మంచి కంటెంట్ తో ఆసక్తిదాయకంగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎ.బి.శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: ఆనంద్, కెమెరా: మల్హర్ భట్ జోషి.