ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (22:35 IST)

అనంతపురం కాలేజీ ఘటనపై తప్పుడు ప్రచారం : మంత్రి ఆదిమూలపు సురేష్

అనంతపురంలో కాలేజీ ఘటనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. విద్యార్థుల ముసుగులో కొందరు దుండగులు ఈ ధర్నాలో చొరబడ్డారని, పోలీసులపై రాళ్లు రువ్వారని, విద్యార్థిని కూడా గాయపర్చారని మంత్రి అన్నారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో మంగళవారం మంత్రి సురేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అనంతపురం కాలేజీ ఘటనపై ప్రతిపక్ష పార్టీ, కొన్ని పత్రికలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవ వివరాలను తెలిపారు.  
 
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సోమవారం నాడు అనంతపురం జిల్లాలో శ్రీసత్యసాయి బాబా నేషనల్ (SSBN) కాలేజీ ఆవరణలో జరిగిన ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అవాస్తవ ప్రచారానికి కొన్ని మీడియా సంస్థలు మద్దతు పలుకుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటున్న కొంత మంది విద్యార్థులను రెచ్చగొట్టారన్నారు. ఈ క్రమంలో వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు.

విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసులు లాఠీచార్జ్‌ చేయలేదంటూ జయలక్ష్మి అనే బాధిత విద్యార్థినే చెబుతోందని.. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఆ అమ్మాయి స్వయంగా రికార్డు చేసిన వీడియోలో కూడా పోలీసులు ఎక్కడా కొట్టలేదని తెలిపిందని చెప్పారు.

దుండగులు వేసిన రాళ్ల దాడిలోనే విద్యార్థిని గాయపడిందన్నారు. రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల పనితీరుపై కమిటీ వేశామని.. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలు విద్యార్ధుల భవిష్యత్ తో ఆటలు ఆడుకోవడం ఎంతవరకూ సమంజసంమని మంత్రి ప్రశ్నించారు.

14 సంవత్సరాలు అధికారంలో ఉండి.  40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ప్రతిపక్షం.. సరస్వతి పుత్రులపై దాడులంటూ సినీ ఫక్కీలో ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. 14 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ప్రైవేటీకరణ చేశారని.. ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం చేసింది ఆయన కాదా అన్నారు. ప్రతిపక్షం పరిపాలనా కాలంలో ఎప్పుడైనా ఎయిడెడ్ కాలేజీలపైన సమీక్షలు చేశారా అని ప్రశ్నించారు. 1999, 2006, 2017లో ఎయిడెడ్ పోస్టుల భర్తీ చేయడానికి వీలులేదని చెప్పింది గత ప్రభుత్వం కాదా..? యూనివర్సిటీలలో పోస్టులను రిజెక్ట్ చేసింది ఎవరో అందరికీ తెలుసునన్నారు. 

SSBN కాలేజీ ఘటనను ప్రాథమిక నివేదికగా తీసుకున్నామని మంత్రి వివరించారు. 1991 నుంచి స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఈ ప్రాంగణంలో నడుస్తున్నాయన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు కాలేజీ యాజమాన్యం ప్రభుత్వానికి స్పష్టం చేసిందన్నారు. విద్యార్థులను,  తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం అనంతపురం ఘటనకు తెరలేపిందన్నారు. మొదట పేరేంట్స్ మీటింగ్ లు పెట్టి తల్లిదండ్రులను రెచ్చగొట్టారని, ఇఫ్పుడు విద్యార్థులతో చేయిన్నారని చెప్పారు.

ఫీజులు పెరుగుతాయని విద్యార్థులతో చెప్పిస్తున్నారని.. ఫీజులు ఎక్కడా పెరగవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 90 శాతం కోర్సులు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో.. 3 సంవత్సరాల పాటు హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ణయించిన ఫీజులే కొనసాగుతాయన్నారు. ఫీజులు పెంచడం లేదా తగ్గించే అవకాశం ఎవరికీ లేదని అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. జగనన్న విద్యా దీవెన కింద ప్రతి ఒక్క రూపాయి విద్యార్థికి ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద తిరిగి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 

గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో ఎలాంటి పురపొచ్చాలు ఉన్నా.. వారి అందరితో చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి తెలిపారు. ఎయిడెడ్ కాలేజీలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగిస్తే.. వాటిని నాడు-నేడు కార్యక్రమం కింద పూర్తిగా అభివృద్ది చేస్తామన్నారు. ప్రతిపక్షం విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రైవైట్ యూనివర్సిటీ చట్టం చేసి ప్రభుత్వ భూములను ప్రైవేట్ వారికి గత ప్రభుత్వం ధారాదత్తం చేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ చట్టంలో సవరణలు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పోరేట్ సంస్థల్లో 30 శాతం సీట్లు కేటాయించి.. ఫ్రీగా చదువుకునేలా అవకాశ కల్పించారన్నారు.

ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలు విద్యార్థులు, రాష్ట్రం కోసం కాదని.. విద్యా సంస్థలను టేకోవర్ చేయడానికి ఏమైనా కంపెనీయా...? అని, సంస్కరణల్లో భాగంగా  గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాలేజీలో కొన్ని అవకతవకలను గుర్తించామని, అడ్మిషన్లు గణనీయంగా పడిపోయాయని మంత్రి తెలిపారు. చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో. టీచర్స్, స్టూడెంట్స్ నిష్పత్తి లేని కారణం, మౌలిక సదుపాయాలే లేని కారణంగా, కొన్నిచోట్ల దారుణమైన పరిస్థితులున్నాయని... గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతున్నా కొన్ని చోట్ల పర్మినెంట్ భవనాలు లేకపోవడాన్ని కమిటీ గుర్తించిందని మంత్రి తెలిపారు. 400 స్కూళ్లకు పైగా జీరో అడ్మిషన్స్ ఉన్నాయని తెలిపారు. 
 
విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం ఈ ప్రభుత్వం కృషిచేస్తుందని.. అందులో భాగంగా ఇంగీష్ మీడియం ప్రవేశ పెట్టామని, బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ పెట్టామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని తెలిపారు. నిద్రపోతున్న వారిని లేపవచ్చు గానీ.. నిద్రిస్తున్నట్లు నటిస్తున్నవారిని ఎవరు లేపగలరని...? ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మంచివైనా కూడా ఏదోరకంగా మసిపూపి మారేడు కాయ చేయాలని అవాస్తవాలను ప్రచారం చేయాలనుకుంటున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని పత్రికల్లో పోలీసుల లాఠీఛార్జ్ అని అసత్య ప్రచారాలు చేశారని,. విద్యార్థి సంఘాల ముసుగులో రాళ్లు రువ్వారని, పోలీసులపై చెప్పులు వేశారని... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 
 
ఉన్నత విద్యా శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర మాట్లాడుతూ... 1990 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు తక్కువగా ఉండేవని, నాడు దాతలు, విద్యావేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యా సంస్థలు నిర్వహిస్తే, ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ రూపంలో సాయం చేసేదని, 1990 తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటు జరగలేదని అన్నారు.

1990 తర్వాత ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడంతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యాసంస్థలను ఏర్పాటు చేశాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 45 వేలకు పైగా స్కూళ్లు ఉండగా, 6 వేల ప్రభుత్వ హైస్కూళ్లు ఉండగా, అందులో 434 ఎయిడెడ్ హైస్కూళ్లు ఉన్నాయన్నారు. 

రెండు దశాబ్ధాలుగా రాష్ట్రంలో కొత్తగా ఎయిడెడ్ స్కూళ్లు ఏర్పాటు కాలేదని, 1990 నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది.. నేడు కొత్తగా వచ్చింది కాదన్నారు. 1999 లో ప్రభుత్వ పరంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయకూడదని, ప్రభుత్వం విధానపరంగా ఒక నిర్ణయం తీసుకుందని ఇది కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం కాదన్నారు. ఈ అంశంలో ఒక కమిటీ వేసి, అధ్యయనం చేసిన తర్వాతే, నేటి పరిస్థితుల్లో ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ఎకనమిక్ గా వైబల్ కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

అన్ ఎయిడెడ్ కోర్సుల గురించి, ప్రభుత్వం ఎక్కడ మాట్లాడలేదని, మూడేళ్ల పాటు ఒకే ఫీజు కమిషన్ నిర్ణయం మేరకు ఉంటున్నప్పుడు, ఫీజు పెరుగుతుందని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇందుకు విరుద్ధంగా ఆయా విద్యాసంస్థలు క్యాపిటేటివ్ ఫీజు వసూలు చేస్తే, తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఒకవేళ ఫీజు పెరిగినా, జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజును రీయింబర్స్ మెంట్ ఇస్తామని, దీనివల్ల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు నష్టమేమీ లేదన్నారు.

ఎయిడెడ్ కాలేజీల్లో 3 దశాబ్ధాలుగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ విద్యాసంస్థల్లో విద్యార్ధులుకు ఎవ్వరూ బోధన చేస్తారన్నారు. అన్ ఎయిడెడ్ సిబ్బంది, మేనేజ్ మెంట్, వ్యక్తిగతంగా మాట్లాడి, ప్రభుత్వానికి అప్పజెప్పుతామని చెబితే, ప్రభుత్వ కాలేజీగా నడపడంలో తప్పేముందన్నారు. 
ఒక హైస్కూళ్లు గానీ, ప్రైమరీ స్కూళ్లు గానీ నడవాలంటే కనీసం 100 మందైనా ఉండాలి కదా..? అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలోని విద్యార్థుల వివరాలను సతీష్ చంద్ర వివరించారు. 

10 మంది లోపు ఉన్న స్కూళ్లలో ఎయిడెడ్ సిబ్బంది కూడా ఉన్నారని, అక్కడ ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. ఇది ప్రజల సొమ్మే కదా..? అన్నారు. స్కూళ్లలో టీచర్లు ఒకటే కాదని సరైన గదుల, మంచి నీటి వసతి, ప్రహారీ గోడ, ఫ్యాన్లు, టాయిలెట్స్, ఫర్నీచర్ వంటి మౌలిక సదుపాయాలన్నీ ఉండాలన్నారు.  ప్రైమరీ స్కూళ్లలో చాలా చోట్ల త్రాగునీటి సౌకర్యం లేదన్నారు. 1-10 విద్యార్థులున్న హైస్కూళ్లు 28 ఉన్నాయన్నారు.

11-20 విద్యార్థులున్న వారు హైస్కూళ్లు 70, 21-30 విద్యార్థులున్న వారు హైస్కూళ్లు 81, 31-40 విద్యార్ధులున్న హైస్కూళ్లు 41, 41-50 విద్యార్ధులున్న హైస్కూళ్లు 20, 51-60 విద్యార్ధులున్న హైస్కూళ్లు 27, 61-70 విద్యార్ధులున్న హైస్కూళ్లు 32, 71-100 విద్యార్ధులున్న హైస్కూళ్లు 27, 101-200 విద్యార్ధులున్న హైస్కూళ్లు 73, 201-300 విద్యార్ధులున్న హైస్కూళ్లు 15, 301-400 విద్యార్ధులున్న హైస్కూళ్లు 14, 401-500 విద్యార్ధులున్న హైస్కూళ్లు 03, 501- ఆపైన 3 మొత్తం 434 ఎయిడెడ్ హైస్కూళ్లు ఉన్నాయని వివరించారు.

అలాగే ప్రైమరీ స్కూళ్ల విషయంలో 1-10 విద్యార్థులున్న స్కూళ్లు 66 ఉన్నాయి. 11-20 విద్యార్థులున్నవి 132 ప్రీస్కూళ్లు ఉన్నాయన్నారు.  మంచిగా నడిపే ఎయిడెడ్ స్కూళ్లు, వ్యవస్థ ఉంటే, మేము నిర్వహించవద్దని చెప్పడం లేదని,  ఎయిడెడ్ సంస్థలు సమర్ధవంతంగా నిర్వహించలేని పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వ పాఠశాల లేకపోతే, కొత్తగా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తుందని, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగదన్నారు. విద్యార్ధులు, యాజమాన్యం, సిబ్బంది నుంచి ఏదైనా సమస్యలు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందన్నారు.