సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 10 జులై 2020 (17:30 IST)

లాక్‌డౌన్, కుమార్తె పుష్పావతి అయితే డబ్బులు లేక తండ్రి ఆత్మహత్య

అసలే నిరుపేద కుటుంబం. ఒక్కగానొక్క కూతురు. తండ్రి ఆటోడ్రైవర్. కుమార్తె పుష్పావతి అయ్యింది. ఓణీ ఫంక్షన్ చేయాలని భార్య ఒత్తిడి. చేతిలో డబ్బులు లేవు. కరోనాతో ప్యాసింజర్లు కరువయ్యారు. అప్పు ఇచ్చేందుకు ఏ స్నేహితుడు ముందుకు రాలేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఆ తండ్రి. ఆత్మహత్య చేసుకున్నాడు.
 
తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పేరు చంద్రయ్య. స్థానికంగా తుమ్మలగుంటలోనే నివాసముండేవాడు. మూడునెలల పాటు కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
 
తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబంలో కుమార్తెకు ఓణీ ఫంక్షన్ చేయాల్సిన సమయం వచ్చింది. ఇంట్లో భార్య నుంచి ఒత్తిడి ఎక్కువైంది. చుట్టుప్రక్కల వారు ప్రశ్నించారు. ఎప్పుడు కూతురు ఓణీల ఫంక్షన్ అని అడిగారు. తండ్రిగా తాను ఆ చిన్న ఫంక్షన్ కూడా చేయలేకపోతున్నానని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.