బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (12:51 IST)

నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్ : ఏపీ విత్తమంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 సంవత్సరానికి గాను శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాల అమలునే అజెండాగా చేసుకుని ఈ బడ్జెట్‌ను తయారు చేశారు.
 
ఈ సందర్భంగా విత్తమంత్రి బుగ్గన స్పందిస్తూ, వైసీపీ విజన్‌ను సాకారం చేసే దిశగా, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను తయారు చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా, నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్‌ అని, ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేసి తీరుతామన్నారు. 
 
నవరత్నాలతోపాటు వ్యవసాయం, నీటి పారుదల, పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాలయాపన లేకుండా తొలి సంవత్సరమే తమ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అందుకు తగ్గట్టుగా కేటాయింపులు ఉంటాయని సభకు వెల్లడించారు. 
 
తమ ప్రభుత్వపాలన పేదల కన్నీరు తుడిచేవిధంగా ఉంటుందన్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామన్నారు. కృష్ణా ఆయుకట్టును స్థిరీకరిస్తామన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. 
 
ఉత్తరాంధ్రలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు త్వరగా పూర్తి చేస్తామని, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కాంట్రాక్టుల్లోనూ పారదర్శకత పాటిస్తామని మంత్రి బుగ్గన ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని నిరోధించేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్నీ అమలు చేస్తామని మంత్రి బుగ్గన ప్రకటించారు.