ఠాగూర్|
Last Updated:
మంగళవారం, 4 ఆగస్టు 2020 (08:52 IST)
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ఇకలేరు. "ఏం పిల్లడో ఎల్దమొస్తవా.." అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు. విజయనగరం జిల్లా పెదబొండపల్లికి చెందిన వంగపండు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
1943లో జన్మించిన వంగపండు ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరుగాంచారు. 1972లో
జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో గిరిజనులను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. వందలాది జానపదాలకు ప్రాణం పోసిన ఆయనకు 2017లో కళారత్న పురస్కారం లభించింది.
వంగపండు మృతి విషయం తెలిసిన వెంటనే విప్లవకవి గద్దర్ స్పందించారు. ఆయనది పాట కాదని, అది ప్రజల గుండె చప్పుడు అని కొనియాడారు. అక్షరం ఉన్నంత వరకు ఆయన జీవించి ఉంటారని అన్నారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి వంగపండు అని ప్రశంసించారు.
తన జీవిత కాలంలో వందల పాటలకు ఆయన గజ్జెకట్టారు. 1972లో జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో బడుగుబలహీన వర్గాలను, గిరిజనులను చైతన్య పరిచారు. 2017లో కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు.