బ్యాంకుకు తాళం మరిచితిరి, దొంగా దొంగా అని అరిచితిరి
మనం ఎక్కిడికైనా వెళితే, ఇంటికి తాళం సరిగా వేశామా? లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటాం. కానీ, ఏకంగా బాంకుకే తాళం వేయడం మరిచిపోయారు ఇక్కడ సిబ్బంది. పైగా ఉదయాన్నే వచ్చి తలుపులు తెరిచి ఉన్నాయని, దొంగలు పడ్డారని కంప్లయింట్ ఇచ్చారు. అంతా చెక్ చేసి... ఎంతటి మహానుభావులు బాబూ మీరు అని పోలీసులు తలలు పట్టుకున్నారు.
ప్రకాశంజిల్లా కనిగిరిలో ఈ ఘటన జరిగింది. కనిగిరిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం కాసేపు అందరినీ హడలించింది. సోమవారం సాయంత్రం బాంకుకు తాళాలు వేయడం మరిచిన సిబ్బంది, ఉదయం వచ్చి చూసే సరికి తాళాలు తీసి ఉండటాన్నిగమనించి... చోరీ జరిగినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పరుగు పరుగున వచ్చిన పోలీసులు తీరా, దొంగల ఆచూకి కోసం సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు. చివరికి ఏ దొంగా రాలేదు...కేవలం బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమేనని తేల్చిన చెప్పారు పోలీసులు. ముందు రోజు తాళం వేయకుండా అజాగ్రత్తగా సిబ్బంది వెళ్లిపోయారని, తర్వాతి రోజు వచ్చి తాళాలు తెరిచి ఉన్నాయని కంప్లయింట్ చేశారని ఓ నిట్టూర్పు విడిచారు.