గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 22 జూన్ 2021 (08:33 IST)

కృష్ణానది తీరంలో గ్యాంగ్ రేప్: ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం, పడవలో పారిపోయిన నిందితులు

కృష్ణా నది తీరంలో సేద తీరుదామని వచ్చిన ప్రేమికులను అడ్డగించారు. ఇద్దరినీ బెదిరించి, ప్రియుడిని తాళ్లతో కట్టేశారు. అనంతరం ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ అకృత్యానికి ఒడిగట్టిన నిందితులు ఆ తర్వాత దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 
ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది ఇసుక తిన్నెలపై జరిగిన ఈ ఘటన.. బాధితులు వచ్చి బ్యారేజ్ దగ్గర డ్యూటీలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. నిందితులకు సంబంధించిన ఆధారాలు లభించాయని, ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నాయని గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు చెప్పారు.

 
కరోనా కారణంగా వాయిదా పడిన పెళ్లి
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ''విజయవాడకు చెందిన ఓ యువజంట ప్రేమను ఇప్పటికే రెండు వైపుల పెద్దలు కూడా అంగీకరించారు. వారికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. కరోనా కారణంగా పెళ్లి వాయిదాపడింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆ జంట ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన సీతానగరం పుష్కర ఘాట్ వద్దకు చేరుకుంది.

 
అక్కడే మెట్ల మీద కొంత సేపు గడిపిన తర్వాత ఇసుక తిన్నెలపైకి వెళ్లారు. మహానాడు ప్రాంతానికి సమీపంలో రైల్వే వంతెనల కిందకు వెళ్లిన తర్వాత వారిని ముగ్గురు అడ్డుకున్నారు. దాంతో వాళ్లు ఆందోళన చెంది వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే వారిని అడ్డుకుని ప్రియుడిని తాళ్లతో కట్టేశారు'' అని పోలీసులకు అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ''ఆ తర్వాత ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత నిందితులు అక్కడే ఉన్న పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారు'' అని బాధితులు ఫిర్యాదు చేశారు.

 
కోలుకుంటున్న బాధితురాలు
తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు అర్బన్, విజయవాడ సిటీ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరువలో సామూహిక అత్యాచార ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బాధితులను విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు, ఆమె ప్రియుడు ఇద్దరూ కోలుకున్నట్టు తాడేపల్లి సీఐ శేషగిరిరావు బీబీసీకి తెలిపారు.

 
నేరాలకు కేంద్రంగా పుష్కర ఘాట్ ప్రాంతం
ప్రకాశం బ్యారేజ్‌ని ఆనుకుని ఉన్న సీతానగరం పుష్కరఘాట్ ప్రాంతంలో అనేక నేరాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సీతానగరం వాసి ఎం.కాశీవిశ్వేశ్వర రావు బీబీసీతో మాట్లాడుతూ.. ''చీకటి పడితే చాలు చాలామంది వచ్చేస్తున్నారు. అర్ధరాత్రి వరకూ ఇక్కడే ఉంటారు. మెట్లుపైన మందు బాటిళ్లతో పార్టీలు చేసుకుంటారు.

 
రైల్వే వంతెనల కింద గంజాయి ముఠాలు తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు రాత్రి పూట డ్యూటీ నుంచి వస్తున్న కార్మికులను ముఠా అడ్డుకుని డబ్బులు గుంజుకున్న దాఖలాలున్నాయి. తాగిన తర్వాత వారి మధ్య వచ్చే తగాదాలు కూడా నిత్యం చూస్తుంటాం. పోలీసులు కూడా దగ్గరలోనే ఉంటారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయరు. దాంతో రాత్రి 8 దాటితే ఆ దారిలో రావాలంటే భయం వేసి, వారధి మీదుగా వస్తూ ఉంటాం'' అని చెప్పారు.

 
కష్టమవుతున్న నిందితుల గుర్తింపు
గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన దుండగుల కోసం గాలింపులో భాగంగా పలువురు అనుమానితులను పోలీసులు గుర్తించారు. వారిని బాధితుల ముందు ప్రవేశపెట్టారు. అయితే చీకటి వేళ జరిగిన ఘటనలో నిందితులను గుర్తుపట్టలేకపోతున్నామని బాధితులు తెలిపారు. ఇప్పటికే విజయవాడలో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, వారు కాదని బాధితులు చెప్పారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని గుర్తించి, బాధితుల వద్దకు తీసుకెళ్లగా వారు కాదని తేల్చారు.

 
ఈ ఘటనకు బ్లేడ్ బ్యాచ్ కారకులనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో కృష్ణాతీరానికి వచ్చే గంజాయి ముఠా పట్ల కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 
ఆధారాలు దొరికాయి.. నిందితులను పట్టుకుంటాం
అత్యాచారానికి పాల్పడిన నిందితుల ఆనవాళ్లు లభించాయని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ బీబీసీకి తెలిపారు. ''నిందితులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నాం. వారికి సంబంధించిన ఆధారాలు సేకరించాం. నదిలో నీరు తక్కువగా ఉండటంతో సులువుగా అటువైపు చేరారు. నాటు పడవలో వెళ్లారంటే స్థానిక పరిస్థితులు తెలిసినవారే అయ్యుంటారు. పట్టుకుంటే తప్ప ఎవరనేది చెప్పలేం. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతోంది. ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి'' అని అన్నారు.