గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (09:41 IST)

కృష్ణా పుష్కరఘాట్‌ వద్ద ప్రియుడ్ని తాళ్ళతో కట్టేసి.. ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. తాడేపల్లి పరిధిలో ప్రియుడ్ని తాళ్ళతో కట్టేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన సీతానగరం పుష్కరఘాట్ల వద్ద శనివారం రాత్రి జరిగింది. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నగరానికి చెందిన ఓ ప్రేమ జంట శనివారం రాత్రి 9 గంటల సమయంలో సీతానగరం పుష్కరఘాట్ల వద్దకు వచ్చింది. నదీ తీరంలోని మెట్ల మీద కొద్దిసేపు గడిపిన తర్వాత రైలు వంతెన సమీపంలో ఇసుక తిన్నెలపై నడుస్తూ వెళ్తున్నారు. 
 
వీరిని గుర్తించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. ప్రేమజంటను బెదిరించారు. ప్రియుడిని తాళ్లతో కట్టేసి, ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నది ఒడ్డున మత్స్యకారులకు చెందిన పడవలో అవతలి వైపు వెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత తేరుకున్న బాధితులు అర్థరాత్రి సమయంలో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
కేసు నమోదు చేసిన పోలీసులు... బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు నది తీరంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు తాడేపల్లి ఎస్‌ఐ వినోద్‌ తెలిపారు. 
 
ఈ దారుణానికి బ్లేడ్‌ బ్యాచ్‌ పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని ఆదివారం సాయంత్రం అర్బన్‌ అడిషనల్‌ ఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ దుర్గాప్రసాద్‌, సీఐ శేషగిరిరావు, ఎస్‌ఐలు వినోద్‌, బాలకృష్ణతో పాటు విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పరిశీలించారు.
 
మరోవైపు, కృష్ణానది పుష్కరఘాట్‌ వద్ద యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. నిందితులను గుర్తించేందుకు పోలీసు బృందాలు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాయన్నారు.