మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ఏపీ సర్కారుపై తెలంగాణ గరంగరం.. తాడోపేడో తేల్చుకుంటామంటూ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఏపీ సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయింయింది. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత శనివారం ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో సాగునీటి పారుదల రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ నిర్మిస్తున్న అనుమతి లేని ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించినా పట్టించుకోకపోవడాన్ని కేబినెట్ తీవ్రంగా పరిగణించింది. 
 
ఏపీ తీరుపై న్యాయస్థానాల్లోను, ప్రజా క్షేత్రంలోను తేల్చుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు, పార్లమెంటు సమావేశాల్లోనూ దీనిపై ప్రస్తావించాలని, ఏపీ ప్రాజెక్టుల కారణంగా తెలంగాణలో జరగబోయే నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించనుంది.
 
ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయించాలని కోరాలని నిర్ణయించింది. ఏపీ ప్రాజెక్టుల కారణంగా హైదరాబాద్‌కు తాగునీరుతోపాటు పలు జిల్లాలకు సాగునీరు విషయంలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడిన కేబినెట్.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినా కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా నిర్ధారణ కాకపోవడంపై కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది.