శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (08:58 IST)

తెలంగాణాలో అన్‌లాక్? : థియేటర్లకు అనుమతి.. కొనసాగనున్న రాత్రి కర్ఫ్యూ

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా మేరకు తగ్గింది. దీంతో ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యధావిధిగా ప్రజా కార్యకలాపాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. అంటే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 
 
ఈ నెల 20నుంచి అన్‌లాక్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ  అంశంపై చర్చించడానికి శనివారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరగనుంది. 
 
లాక్‌డౌన్‌తోపాటు వర్షపాతం, వానాకాలం సాగు, గోదావరి నుంచి ఎత్తిపోతలు, జల విద్యుత్తు ఉత్పత్తి తదితర అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకూ లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. 
 
అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, పాజిటివిటీ రేటు 1.36శాతంగా నమోదు కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 
 
ఈ మేరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేసి రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు సమాచారం. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో సినిమా థియేటర్లకు అనుమతి ఇవ్వడంతో పాటు పార్కులను సైతం తెరిచే అవకాశం ఉంది. అయితే, అంతర్రాష్ట్ర బస్సులను మాత్రం ఇప్పట్లో అనుమతించరాదని ప్రభుత్వం భావిస్తోంది.