బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (17:07 IST)

సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే లాక్డౌన్ ఎత్తివేత : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క‌రోనా తీవ్ర‌త‌ త‌గ్గుముఖం, లాక్డౌన్ ఎత్తివేత‌తో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేరకు శ‌నివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో స‌మావేశమైన రాష్ట్ర మంత్రివ‌ర్గం ఈ మేర‌కు విద్యాశాఖ‌ను ఆదేశించింది. 
 
ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని పేర్కొంది. 
 
ఇంటి నుంచి బయటకు వచ్చేటపుడు విధిగా ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని సూచన చేసింది. 
 
అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు త‌మ‌ సంపూర్ణ సహకారం అందించాలని కేబినెట్ కోరింది.
 
మరోవైపు, రాష్ట్రంలో లాక్డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ ఈ మేరకు లాక్డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. 
 
లాక్డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రివ‌ర్గం ఆదేశించింది. దేశవ్యాప్తంగానే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. 
 
తెలంగాణలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వ‌చ్చింద‌ని అధికారులు అందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్దారించింది. ఈ మేరకు జూన్ 19 వరకు అమల్లో ఉన్న లాక్ డౌన్‌ను రేపటి నుంచి (జూన్ 20) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.