కరోనా సూక్ష్మజీవి కాటుకు మాజీ ఎమ్మెల్యే!!

corona virus
ఠాగూర్| Last Updated: ఆదివారం, 4 అక్టోబరు 2020 (17:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో కీలక రాజకీయ నేతగా చెలామణి అవుతూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ చనిపోయారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అయినప్పటికీ.. ఆయన మృతి చెందడం ఇపుడు కలకలం రేపింది.

కొన్నిరోజుల కిందట కరోనా నెగెటివ్ వచ్చినా, ఇతర అనారోగ్యాల నుంచి కోలుకోలేకపోయారు. కరోనా కారణంగా ఇతర అవయవాలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతితో వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రస్తుతం విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీయే) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సీనియర్ రాజకీయవేత్త ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడైన శ్రీనివాస్ చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విప్‌గా వ్యవహరించారు.

విశాఖ సౌత్ నియోజవర్గం నుంచి రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2019 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ ఆయనకు టికెట్ ఇచ్చినా టీడీపీ నేత వాసుపల్లి గణేశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. దాంతో ఆయనకు సీఎం జగన్ వీఎండీఆర్ఏ ఛైర్మన్ పదవిని సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. కానీ, కరోనా రూపంలో ఆయనకు మృత్యువు సంభవించింది.దీనిపై మరింత చదవండి :