బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (15:12 IST)

ఎస్పీబీ తొలి రెమ్యూనరేషన్‌.. ఫ్రెండ్స్‌తో కలిసి అవి తిన్నారట..!

SPBalu
గాన గంధర్వుడు ఎస్పీ బాలు ఇక లేరు. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటిన బాలూ హిందీలో తొలిసారి పాడిన 'ఏక్ దూజేలియే' చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరుసార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.
 
తొలిసారి శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రానికి పాట పాడిన బాలు రూ.300 రెమ్యురేషన్ తీసుకున్నారు. ఆ రోజుల్లో ఘంటసాలగారు 500 రూపాయలు తీసుకునేవారు. తొలి రెమ్యునరేషన్ అందుకున్న బాలు ఎంతో సంతోషించారు. తన సొంత డబ్బుతో ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లి గులాబ్‌జామూన్‌, మసాలాదోశ తిన్నారు. అదే రోజున జేమ్స్ బాండ్ సినిమాకు కూడా వెళ్ళినట్టు బాలు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
 
దాదాపు యాభైవేల పాటల్ని పాడి గిన్నిస్‌ రికార్డు సాధించిన గొప్ప గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. ఔత్సాహిక గాయనీ గాయకుల్ని తయారుచేస్తూ... సంగీత ప్రస్థానంలో తనదైన ముద్రవేసుకున్న బాలు ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. బాలు గళంలో ఏదో గమ్మత్తు , తెలియని మాధుర్యం ఉంటుంది.
 
సంగీత పరిజ్ఞానం లేకపోయిన కూడా శంకరాభరణం చిత్రం కోసం ఎంతో సాధన చేసి పాటలు పాడారు. వాణీ జయరాం, జానకి ప్రోత్సాహంతోనే ఈ సినిమాకు పాడానని బాలు చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇక బాలు గురించి బాలమురళి ఓ సందర్భంలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 'బాలు సంగీతం నేర్చుకుని ఉంటే... నాలా పాడి ఉండేవాడు. కానీ నేను బాలూలా పాడలేను...' అని అన్నారు.
 
మహావిధ్వాంసుల మాటలకు బాలు ఎంతగానో సంతృప్తి చెందారు. ఎస్పీ కోదండపాణి నుంచి రెహమాన్ వరకు దాదాపు అందరితో కలిసి పని చేశారు బాలు. రఫి పాటలని బాగా ఇష్టపడే బాలు చాలాసార్లు ఆయనకు అలాంటి అవకాశం ఎందుకు రాలేదని బాధపడ్డారు.
 
రాజేష్‌ పాడిన 'ఎటో వెళ్లిపోయింది మనసు...', మనో పాడిన 'ప్రియా ప్రియతమా రాగాలు.., ఇళయ రాజా పాడిన 'కలయా నిజమా...' వంటి పాటలు పాడే అవకాశం నాకు ఎందుకు రాలేదా అంటూ బాలు చాలా సార్లు బాధపడ్డారు.