ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి... 158 మందికి తప్పిన ప్రాణముప్పు
మరో ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కొలంబో నుంచి చెన్నైకు వస్తున్న ఎయిరిండియా విమానాన్ని నింగిలో ఓ పక్షి ఢీకొట్టింది. దీన్ని గమనించని పైలెట్లు విమానాన్ని ఎప్పటిలాగానే సురక్షితంగా చెన్నైలో ల్యాండింగ్ చేశారు. దీంతో ఆ విమానంలోని 158 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాలను పరిశీలిస్తే, ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737-800 విమానం మంగళవారం మధ్యాహ్నం కొలంబో నుంచి చెన్నైకు బయలుదేరింది. విమానం చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరిధిలోకి ప్రవేశించిన సమయంలో విమానం గాల్లో ఉండగా ఓ పక్షి ఢీకొట్టింది. అయితే, విమాన ప్రయాణ సమయంలో ఎలాంటి కుదుపులు గానీ సమస్యలు తలెత్తకపోవడంతో పైలెట్లతో పాటు ప్రయాణికులు దీన్ని గమనించలేదు.
విమానం చెన్నైలో ల్యాండింగ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ సిబ్బంది సాధారణ తనిఖీలు చేస్తుండగా పక్షి ఢీకొన్న విషయాన్ని గుర్తించారు. ఈ కారణంగా విమానంలో స్వల్పంగా సాంకేతిక సమస్య తలెత్తినట్టు నిర్ధారించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని తాత్కాలికంగా నిలిపివేసి పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన విమాన సర్వీసును ఎయిరిండియా రద్దు చేసింది.