అమర జవాన్ జగదీష్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
విజయనగరం: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్‌లో మావోయిస్టుల కాల్పుల కారణంగా మృతి చెందిన సిఆర్‌పిఎఫ్ కోబ్రా కమాండర్ రౌతు జగదీష్ పార్థీవ శరీరానికి, వేలాదిమంది అశ్రునయనాలమధ్య అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, సిఆర్‌పిఎఫ్ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు హాజరై, జగదీష్‌కు ఘనంగా నివాళులర్పించారు.
దేశం కోసం ప్రాణాలు వదిలిన జగదీష్ భౌతిక కాయానికి, భారీ జనసందోహం మధ్య అంతిమయాత్ర నిర్వహించి, మంగళవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో గాజులరేగ శ్మశానవాటికకు తరలించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ ప్రకారం, అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం జగదీష్ పార్థీవ శరీరం వద్ద జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్‌డిఓ భవానీ శంకర్, సిఆర్‌పిఎఫ్ అధికారులు పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు. గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం సిఆర్‌పిఎఫ్ జవాన్లతోపాటు, రాష్ట్రప్రభుత్వం తరపున పోలీసులు వేర్వేరుగా మూడు సార్లు గాలిలో కాల్పులు జరిపి, జగదీష్‌కు గౌరవలాంఛనాలతో తుదివీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో సిఆర్‌పిఎఫ్ ఐజి జివిహెచ్ గిరి ప్రసాద్, డిఐజి ఏ.శ్రీనివాస్, కమాండెంట్ సంజీవ్, ఇంకా ఎన్‌కె చౌదరి తదతర అధికారులు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, విజయనగరం తాశీల్దార్ ఎం.ప్రభాకరరావు, ఇతర రెవెన్యూ సిబ్బంది, లోక్‌సత్తా రాష్ట్ర నాయకులు భీశెట్టి బాబ్జీ, బిఎస్‌పి నాయకులు పాండ్రంకి రమణ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు జగదీష్ పార్థీవ శరీరాన్ని విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి, పలువురు ఇతర నాయకులు, డిఐజి కాళిదాస్ రంగారావు, విశాఖ ఎస్‌పి బి.కృష్ణారావు, జిల్లాకు చెందిన ఇతర పోలీసు అధికారులు సందర్శించి, పూలమాలలతో నివాళులర్పించారు. జగదీష్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.