గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 అక్టోబరు 2021 (19:19 IST)

వక్ఫ్ భూముల పరిరక్షణలో రాజీలేని పోరాటం: మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు

వక్ఫ్ భూముల పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీ లేదని అవరసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలిపారు. అక్రమణ దారుల నుండి భూములను వెనక్కి తీసుకోవటంలో చేపట్టవలసిన చట్టపరమైన చర్యల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో ఉన్న వక్ప్ భూములను బుధవారం ప్రత్యేక కార్యదర్శి పరిశీలించారు.
 
వివాదాలను అధికమించి తిరిగి వక్ఫ్‌కు దఖలు పరిచిన భూములను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గనిర్ధేశకత్వంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ఆక్రమణలో ఉన్నపలు భూములు తిరిగి వక్ఫ్ కు దఖలు పడ్డాయన్నారు. జిల్లాలోని దాచేపల్లి గ్రామంలో 569/1ఎ1 సర్వేనెంబర్‌కు సంబంధించిన ఎనిమిది ఎకరాల భూమి అన్యాక్రాంతం కాగా సకాలంలో గుర్తించి వెనక్కి తీసుకోగలిగామన్నారు.
 
ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో 408 సర్వే నెంబర్లో ఆక్రమణలకు గురైన 9.92 ఎకరాల భూమిని అసూర్ ఖానా పరిధిలోకి తీసుకురాగలిగామన్నారు. అదే క్రమంలో ఇదే మండలం కరుచుల గ్రామంలో 43/1 సర్వే నెంబర్ లోని 11.97 ఎకరాల భూమిని సైతం అక్రమణల చెర నుండి విముక్తి కల్పించామని గంధం చంద్రుడు వివరించారు. రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించటం ద్వారా మసీదులకు చెందిన భూముల పరిరక్షణ కోసం పనిచేయనున్నామన్నారు. 
 
న్యాయపరమైన వివాదాలలో ఉన్న భూముల విషయంలో ప్రతివారం అయా జిల్లాల వారిగా సమీక్ష నిర్వహించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించామని స్పష్టం చేసారు. పక్షం రోజులకు ఒకసారి రాష్ట్ర స్ధాయిలో సమీక్ష చేపడతామని ప్రత్యేక కార్యదర్శి వివరించారు. భూముల పరిశీలన కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి అలీమ్ బాషా, గుంటూరు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షేక్ మస్తాన్ షరీఫ్, వక్ఫ్ బోర్డు ఇన్ స్పెక్టర్లు, రెవిన్యూ అధికారులు, సర్వే సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.