వరుడుకి మాయమాటలు చెప్పి పెళ్లి ఆపి వేయించిన యువకుడు... చితక్కొట్టిన బంధువులు
ఈ నెల 22వ తేదీన జరగాల్సిన వివాహం గ్రామ వలంటీరు కారణంగా ఆగిపోయింది. మరికొన్ని గంటల్లో వధువు మెడలో మూడు ముళ్లు వేయాల్సిన వరుడికి మాయ మాటలు చెప్పడంతో వరుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో హతాశులైన వధువు కుటుంబ సభ్యులు కారణాలు ఆరా తీశారు. ఇందులో పెళ్లి ఆగిపోవడానికి గ్రామ వలంటీరు కారణమని తేలింది. దీంతో అతన్ని పట్టుకుని చితకబాదాడు. చెప్పులు, చీపురు దండలు మెడలో వేసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన గన్నవరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కృష్ణ జిల్లా గన్నవరం సచివాలయం-3లో ఈడ్పుగంటి రాంబాబు గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే సచివాలయ పరిధిలో వలంటీరుగా పనిచేస్తున్న యువతికి ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం చొప్పరమెట్లకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది.
వీరి వివాహం ఈ నెల 22వ తేదీన జరగాల్సివుంది. ఇందుకోసం ఇరుకుటుంబాలు ఏర్పాట్లలో మునిగిపోయాయి. ఈ క్రమంలో పెళ్లికి ముందు రోజు రాత్రి పెళ్లికొడుకును వెతుక్కుంటూ వెళ్లిన రాంబాబు.. పెళ్లి కూతురు, తాను ప్రేమించుకున్నామంటూ మాయమాటలు చెప్పాడు. దీంతో వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది.
ఎందుకు రద్దు చేసుకుంటున్నదీ చెప్పాలని నిలదీయడంతో రాంబాబు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వధువు కుటుంబ సభ్యులు శనివారం పంచాయతీ కార్యాలయానికి వెళ్లి రాంబాబును పట్టుకుని చీపుర్లు, చెప్పులతో చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు