సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

జీహెచ్ఎంసీ ఉందా? లేదా? కుక్కలదాడి ఘటనపై హైకోర్టు ప్రశ్నలు

streetdogs
ఇటీవల హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృత్యువాతపడగా, దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా తెలంగాణ హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాద్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‍ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద పెరిగిపోతుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని, అస్సలు ఉందా లేదా అని నిలదీసింది. మరోవైపు, వీధి కుక్కల బెడద, కుక్కకాటు నివారణ కోసం పురపాలక శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో ఆదివారం కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ కేసును హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. వీధి కుక్కలు అంశంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ ఉదంతంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. వివరణ ఇవ్వాలంటా జీహెచ్ఎంసీ, సీఎస్, అంబర్‍పేట్ మున్సిపల్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు నోటీసు జారీచేసింది. అలాగే, బాలుడి మృతి బాధాకరమని, నష్ట పరిహారం అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచన చేసింది.