ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 2 మార్చి 2017 (07:01 IST)

ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుంటే రాజ్‌భవన్‌కు రాలేరు: గవర్నర్ ఝలక్

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గవర్నర్‌ నరసింహన్‌ గట్టి షాకిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడానికి ససేమిరా అన్నట్లు అత్యంత విశ్వస

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గవర్నర్‌ నరసింహన్‌ గట్టి షాకిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడానికి ససేమిరా అన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆ వర్గాల కథనం ప్రకారం.. గవర్నరే స్వయంగా ఏపీకి చెందిన ఓ సీనియర్‌ మంత్రికి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.  
 
‘వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీకి ఫిరాయించిన వారు తమ పదవులకు రాజీనామా చేయాలి. వాటికి ఆమోదం పొందాలి. ఆ తర్వాతే రాజ్‌భవన్‌కు రావాలి. రాజీనామా చేసి, ఆమోదం పొందితే తప్ప వారిచేత ప్రమాణ స్వీకారం చేయించబోను’ అని తేల్చిచెప్పారు. 
 
టీడీపీలో కొందరితో పాటు వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చి చేరిన ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తామని చంద్రబాబు ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో గవర్నర్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు చంద్రబాబు సహా టీటీడీపీ నేతలు గవర్నర్‌ను తీవ్రంగా తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు చేశారు. 
 
ఆ తరువాత కొంత కాలానికి శ్రీనివాస్‌యాదవ్‌ సహా మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనం కావడంతో అది మరుగున పడిపోయింది. మరోసారి అలాంటి విమర్శలకు తావివ్వకూడదని గవర్నర్‌ భావిస్తున్నారు. అదే విషయాన్ని ఆయన ఇటీవల ఏపీ, తెలంగాణ ఆస్తుల పంపకం సమావేశానికి హాజరైన ఏపీ సీనియర్‌ మంత్రికే చెప్పారు.
 
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన మంత్రి తలసాని వ్యవహారం ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. తలసాని మంత్రివర్గంలో చేరడానికి ముందే తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. స్పీకర్‌ కార్యాలయానికి రాజీనామా కాపీని పంపినట్లు వెల్లడించారు. ఆ తర్వాతే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించలేదు. తెలంగాణ టీడీపీ నేతలు మంత్రి తలసాని రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చారు.
 
ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. అదే సందర్భంలో తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌పై విమర్శలు చేశారు. దీంతో మరోసారి వివాదానికి తావివ్వకూడదని గవర్నర్‌ గట్టిగా నిర్ణయించుకున్నారని రాజ్‌భవన్‌వర్గాలు వెల్లడించాయి.
 
వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ముందుగా పదవులకు రాజీనామా చేయడంతో పాటు వాటికి ఆమోదం పొందాలని, ఆ తరువాతే ప్రమాణ స్వీకరానికి రావాలని గవర్నర్‌ చెప్పడంతో టీడీపీ షాక్‌కు గురైంది.