సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 8 మే 2019 (20:30 IST)

ఏపీ ప్రభుత్వ ఫైలును తిరస్కరించిన గవర్నర్, షాక్‌లో ప్రభుత్వ పెద్దలు

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర స‌మాచార హ‌క్కు చ‌ట్టం క‌మిష‌న‌ర్ల ఎంపికకు సంబంధించిన ఫైలును గవర్నర్ నరసింహన్ తిరస్కరించి వెనుకకు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఆర్టీఐ క‌మిష‌న‌ర్ల నియామ‌కంపై గవర్నర్‌కు రెండు పేర్లు సూచించి పంపించింది ఏపీ ప్రభుత్వం. అయితే  స్థాయికి త‌గ్గ వారిని సూచించ‌ని కార‌ణంగా సూచించిన రెండు పేర్లలో ఒకరికి మాత్రమే గవర్నర్ ఆమోదం తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే మార్చి నెల‌లో ఆర్టీఐ కమీషనర్ల నియామకం కోసం రెండు పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ ఆమోదానికి పంపింది ఏపీ ప్రభుత్వం. ఇందులో విజ‌య‌వాడ‌లోని హోట‌ల్ య‌జ‌మాని ఐలాపురం రాజా ఒక‌రు కాగా, మరొకరు టిడిపి ఎమ్మెల్యే వ‌ద్ద ప‌ని చేసిన ఈర్ల శ్రీ‌రామ‌మూర్తి. అయితే ప్రభుత్వం సిఫారస్ చేసిన రెండు పేర్లలో ఒక్కదానికే గ‌వ‌ర్నర్ ఆమోదం తెలిపారు. క‌మిష‌న‌ర్‌గా నిమితుల‌య్యే వారి ట్రాక్ రికార్డ్, అనుభ‌వం, ప‌నితీరు వంటివి ప్రధానంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. 
 
ఇందులో భాగంగానే ఆర్టిఐ క‌మిష‌న‌ర్ల నియామ‌కంలో ఒక పేరుకు ఆమోదం తెలిపిన గవర్నర్ మ‌రో పేరును తిరస్కరించినట్టు తెలుస్తోంది. క‌మిష‌న‌ర్‌గా విశాఖ జిల్లాకు చెందిన ఈర్ల శ్రీ‌రామ్మూర్తిని నియ‌మించాల‌ని ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. చోడ‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే కెఎస్ ఎన్ రాజుకు పీఏగా చేసిన వ్యక్తిని క‌మిష‌న‌ర్‌గా ప్రతిపాదించడంతో గవర్నర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. 
 
శ్రీ‌రామ్మూర్తి నిత్యం మంత్రి గంటాకు దగ్గరగా ఉంటూ స‌చివాయ‌లంలో ప‌నుల కోసం తిరుగుతార‌నే అభిప్రాయం ఉంది. మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంక‌య్య కుమారుడిని క‌మిష‌న‌ర్‌గా నియ‌మించ‌డంపై పెద్దగా అభ్యంత‌రాలు, విమ‌ర్శలు రాకున్నా... శ్రీ‌రామ‌మూర్తి పేరును ప్రతిపాదించడంపై ప్రభుత్వంలోని వ్యక్తులే షాక్‌కు గుర‌వుతున్నారు. దీంతో గవర్నర్ స‌రైన నిర్ణయమే తీసుకున్నార‌నే అభిప్రాయం వ్యక్తం  అవుతుంది.