శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జనవరి 2024 (11:46 IST)

రాజకీయాలకు గల్లా జయదేవ్ గుడ్‌బై.... గుంటూరు ప్రజలకు ఆత్మీయ విందు

galla jaydev
టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన గంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక రాజీకాయల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టంచేశారు. పైగా, ఇక నుంచి తన వ్యాపారాలపైనే పూర్తి దృష్టిసారిస్తానని ప్రకటించి, ఇంతకాలం తనను ఆదరించిన గుంటూరు ప్రజలకు ఆయన ఆత్మీయ విందు ఇచ్చారు.
 
రెండు సార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్.. ప్రస్తుతం గుంటూరు లోక్‌సభ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడైన గల్లా జయదేవ్... తన తల్లి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒకవైపు, మంచి వ్యాపారవేత్తగా రాణిస్తూనే ఎంపీగా రాష్ట్ర ప్రజలకు  సేవ చేశారు. ఆయనకు అమర రాజా బ్యాటరీస్ కంపెనీతో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. 
 
సినీ నటుడు కృష్ణకు స్వయానా పెద్ద అల్లుడైన గల్లా జయదేవ్... హీరో మహేశ్ బాబుకు స్వయానా బావగారు. మహేశ్ బాబు సోదరి భర్త. ఎంపీగా రెండు పర్యాయాలు గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. పైగా, రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆదివారం గుంటూరు ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నేతలకు గల్లా జయదేవ్ ఆత్మీయ విందు ఇచ్చారు.