బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:27 IST)

సమతుల జీవన శైలితో ఆరోగ్య సంరక్షణ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్య కరమైన ఆహారంతో గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందగలుగుతామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ మాట్లాడుతూ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా “వరల్డ్‌ హార్ట్ డే” ని పాటిస్తున్న తరుణంలో  హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను అధికమించే క్రమంలో ఆరోగ్య నియమాలను పాటించాలన్నారు. 

శరీర తత్వాన్ని అనుసరించి వైద్యులు సూచించిన విధంగా నిత్యం శారీరక వ్యాయామం చేయటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటానికి ప్రయత్నించాలని గౌరవ హరిచందన్ వివరించారు. హృదయ సంబంధ వ్యాధుల ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యాలతో అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్నాయని, ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్దితిని అధికమించ గలుగుతామని గవర్నర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
 
రాష్ట్ర సఫాయి కర్మచారి కమీషన్ ఏర్పాటుకు వినతి 
ఆంధ్రప్రదేశ్ లో సఫాయి కర్మచారి కమీషన్ ఏర్పాటుకు సహకరించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు జాతీయ సఫాయి కర్మచారి కమీషన్ అధ్యక్షుడు ఎం.వెంకటేశన్ విన్నవించారు. బుధవారం విజయవాడ రాజ్ భవన్ లో గౌరవ గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కమీషన్ అధ్యక్షుడు సమకాలీన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా వెంకటేశన్ మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాలలో సఫాయి కర్మచారి కమీషన్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కాలేదని గవర్నర్ హరిచందన్ కు వివరించారు.

రాష్ట్ర విభజన తదుపరి ఎపిలో కమీషన్ ఏర్పాటు కావలసి ఉన్నప్పటికీ ఆ ఏర్పాటు జరగలేదని గౌరవ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.