శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (09:24 IST)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు వేలాడదీశారు. పాఠశాలలోని సీట్లన్నీ భర్తీ అయ్యాయని, తల్లిదండ్రులు సహకరించాలంటూ ప్రకటన బోర్డులు వేలాడదీశారు. 
 
ఏపీ విద్యా విధానంలో ఇటీవలికాలంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పన కోసం భారీ మొత్తంలో సర్కారు నిధులు కేటాయిస్తుంది. కొత్తగా వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. వాటి ఫలితంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల రూపు రేఖలు మారుతున్నాయి.
 
తల్లిదండ్రులు కూడా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లను కాదని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. అదేసమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిచోట్ల 'నో అడ్మిషన్' బోర్డులు వెలుస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ కల్పించలేమని చెబుతున్న తీరు మీద పలు అభ్యంతరాలు వస్తున్నాయి. 
 
గడిచిన రెండేళ్లలోనే అత్యధికులు ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లుతున్నారు. సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో సగటున ఏటా లక్ష మంది చొప్పున కొత్త విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారు.
 
కరోనాకి ముందు కొంతమంది అడ్మిషన్లు కోసం వచ్చేవారు. కానీ ఈ రెండు విద్యా సంవత్సరాల్లో ఆ సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా కారణంగా ప్రైవేటు స్కూళ్లు సక్రమంగా నడిచే అవకాశం లేనందున వేలకు వేలు ఫీజులు కట్టడం ఎందుకనే ప్రశ్న వస్తోంది. దాంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.
 
వారంతా ప్రభుత్వ బడుల్లో కొనసాగుతారా లేదా అనేది ప్రస్తుతానికి చెప్పలేం. కానీ లాక్డౌన్‌తో స్కూళ్లు నడవకపోయినా ఫీజులు చెల్లించడానికి మాత్రం వారు సిద్ధంగా లేరనే చెప్పాలి. ప్రైవేటు స్కూళ్లు మానేసి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ బడులకు రావడానికి నాడు-నేడు వంటి పథకాలు కూడా కొంత దోహద పడ్డాయనే చెప్పొచ్చు.