ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (17:58 IST)

పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకయ్యా : రఘురామ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ మాటల్లో భాగంగా, ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పవన్ మూడు పెళ్లిళ్ళ వ్యవహారం తెరపైకి తెచ్చారు. దీనిపై వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకయ్యా అంటూ ప్రశ్నించారు. 
 
అదేసమయంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో సున్నితమైందని, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. పవన్ కళ్యాణ్‌పై మంత్రి పేర్ని నాని అనవసరంగా కొన్ని మాటలు మాట్లాడారని, ఆయన అనసవరంగా కుల ప్రస్తావన తీసుకువచ్చారన్నారు. 
 
కుక్కలు, గ్రామ సింహాలు, వరాహాలు అంటూ కామెంట్లు చేసుకోవడం సరికాదని హితవు పలికారు. కానీ పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వైవాహిక సంస్కారాలు అనే వ్యాఖ్య చేయడం నీచాతినీచమైన సంస్కృతి అని అన్నారు.
 
గతంలో పవనే దీని గురించి చెప్పారని, కొందరికి అదృష్టం ఉంటుందని, కొందరికి అదృష్టం ఉండదని, మనసులు కలవక విడిపోవడం సహజమేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ద్వారా మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని హితవు పలికారు. 
 
ఎదుటి వ్యక్తి వైవాహిక జీవితం గురించి ఎత్తిచూపేటప్పుడు ఒక వేలు చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయని, ఈ విషయాన్ని పేర్ని నాని, పోసాని కృష్ణమురళి వంటివాళ్లు తెలుసుకోవాలని సూచించారు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది? ఇక్కడ ఎవడు పత్తిత్తు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
సినీ రంగ వివాదం పవన్ కల్యాణ్ "వకీల్ సాబ్" చిత్రం నుంచే ప్రారంభమైందన్నది వాస్తవం అని స్పష్టం చేశారు. ఇప్పటికే కోర్టు కేసుల్లో న్యాయవాదులకు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారని, ఇప్పుడీ దుబారాలు ఎందుకని రఘురామ నిలదీశారు.