శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (19:40 IST)

ఆన్‌లైన్ టిక్కెట్ సిస్టమ్ కావాలని మేమే కోరాం : దిల్ రాజు

సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని తామే ఏపీ ప్రభుత్వాన్ని కోరామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఏపీ మంత్ర మంత్రి పేర్ని నానితో పలువురు టాలీవుడ్ నిర్మాతలు బుధవారం సమావేశమయ్యారు. 
 
ఈ సమావేశం తర్వాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, గతంలోనే ముఖ్యమంత్రి జగన్‌ను చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో పాటు కలిశామన్నారు. సినీ పరిశ్రమపై కరోనా ప్రభావంతో పాటు ఇతర సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 
 
సినీ పరిశ్రమ చాలా సున్నితమైనదని, దయచేసి ఇండస్ట్రీని వివాదాలకు దూరంగా ఉంచాలని కోరారు. టికెట్లను ఆన్‌లైన్లో అమ్మాలని పరిశ్రమ తరపున ప్రభుత్వాన్ని తామే కోరామని చెప్పారు. ఆన్‌లైన్ విధానం ద్వారా పారదర్శకత వస్తుందని అన్నారు.
 
అయితే గత చర్చల సారాంశాన్ని సినీ పరిశ్రమకు వివరించలేకపోయామని... అందువల్లే ప్రస్తుత పరిణామాలు నెలకొన్నాయని చెప్పారు. ఆన్‌లైన్ విధానం ఎలా ఉండబోతోందో స్పష్టతను ఇవ్వాలని పేర్ని నానిని కోరామని తెలిపారు. దీనిపై రానున్న సమావేశాల్లో క్లారిటీ వస్తుందని దిల్ రాజు చెప్పారు.