మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (12:31 IST)

ఏపీకి వాయుగుండం హెచ్చరిక.. ఆ జిల్లాల్లో వానలే వానలు

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వాయుగుండం ముప్పు పొంచివుంది. దీని కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 
 
ప్రస్తుతం దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో సముద్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని, భారత వాతారణ శాఖ తెలిపింది.
 
ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈ నెల 18వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. ఇది మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ఈ అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెంది మరింతగా బలపడిన తర్వాత ఈ నెల 19వ తేదీ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 
 
అలాగే, వాయుగుండంగా మారిన తర్వాత తీరం వెంబడి 40-45 కిలోమీటర్ల మేరకు ఈదురు గాలులు వీస్తాయన, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. 
 
అలాగే, వచ్చే మూడు రోజుల పాటు చలితీవ్రత పెరగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే నాలుగు రోజుల వరకు చలి ఎక్కువగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వెదర్‌మేన్ రిపోర్టు వెల్లడించింది. ఉత్తర భారత దేశం నుంచి చల్లటి గాలులు దిగువకు లాగుతాయని, అందువల్ల వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు.