1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (09:13 IST)

మరో రెండు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు, ఉభయగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. తీరం వెంట గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సరాసరి 62.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 14 వేల ఎకరాల్లో వరి పొలాలు, 3,687 ఎకరాల్లో నారుమళ్లు నీట మునిగాయి.

ముంపు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పలగుప్తం, అమలాపురం, అంబాజీపేట, రాజోలు, అల్లవరం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉప్పాడలో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.

విశాఖ మన్యంలోని హుకుంపేట, ముంచం గిపుట్టు, అరకులోయ, జి.మాడుగుల మండలాల్లో వర్షం కురిసింది. కొండ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గిరిజన గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలో 2531.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

విజయవాడ డివిజన్‌లోని ఏనుగుగడ్డవాగు, వైరా, కట్టలేరు, మున్నేరు, చంద్రయ్యవాగు, చెవిటికల్లు వాగు, నల్లవాగులు, కూచివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బందరు డివిజన్‌లోని తీర ప్రాంత మండలాల్లో, విజయవాడ రెవెన్యూ డివిజన్‌లోని పలు మండలాల్లో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, మొక్కజొన్న పంటల్లో నీరు నిలిచింది.

గుంటూరు జిల్లా పల్నాడులో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గుంటూరు సాంబశివపేట మహిళా కళాశాల వద్ద చెట్టుకూలడంతో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లాల్లో సరాసరిన 6.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.మహానంది మండలంలో పాలేరు వాగు పొంగి పొర్లడంలో మహానంది, గాజులపల్లె మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు ఎరుకలపేటలో ఇంటిగోడ కూలి మీద పడటంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.