1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (16:33 IST)

కృష్ణా - కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం .. రైతులు హర్షం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో కుంభవృష్టి కురిసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఈ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు ఆటంకం ఏర్పడింది. తొలకరి దశలో వర్షాలు కురియడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది.
 
ఇదిలావుంటే, రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. గురువారం చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రోహిణి కార్తె ప్రభావంతో మొన్నటి దాకా ఎండలు మండిపోగా... కార్తె చివర్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 
 
ఆకాశం మేఘావృతమై, చల్లని గాలులు వీయడంతో ఎండ తీవ్రత తగ్గింది. భారీ వర్షాలు, ఈదురుగాలులకు కొన్ని చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. 
 
నైరుతి గాలులు, రుతుపవనాల ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ స్టెల్లా తెలిపారు.  
 
మరోవైపు, కర్నూలు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల చేలు నీటమునిగాయి. రోడ్లు తెగిపోవడం, వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్యాపిలి మండలంలో సుమారు 300 ఎకరాల్లో ఉల్లి, వేరుశనగ పంటలు నీట మునిగాయి. 
 
డోన్‌ మండలంలో 95.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఏలూరులో గాలివాన బీభత్సం సృష్టించింది.  జంగారెడ్డిగూడెం, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.