గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జనవరి 2020 (14:05 IST)

వరల్డ్‌ మోస్ట్‌ డైనమిక్‌ సిటీ హైదరాబాద్

వరల్డ్‌ మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాల్లో టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. బెంగళూరు రెండు, చెన్నై ఐదు, ఢిల్లీ ఆరో ప్లేస్‌లో నిలిచాయి. పుణే, కోల్‌కతా, ముంబై నగరాలు వరుసగా 12, 16, 20 స్థానాల్లో నిలిచాయి. శనివారం విడుదలైన జేఎల్‌ఎల్‌ సిటీ ముమెంటమ్‌ ఇండెక్స్‌ (సీఎంఐ) ఏడో ఎడిషన్‌లో టాప్‌ -20 లిస్టులో రెండొంతులు ఆసియా పసిఫిక్‌ నగరాలే ఉన్నాయి. 
 
నగరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ఈ లిస్టును విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లలో హైదరాబాద్‌ రెండోసారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచిందన్నారు. ‘2014లో హైదరాబాద్‌ ఈ జాబితాలోనే లేదు. 2015లో 30, 2016లో ఐదో స్థానంలో నిలిచింది. 2018లో టాప్‌ ప్లేస్‌కు వచ్చింది. 2019లో బెంగళూరు ఫస్ట్‌ ప్లేస్‌కు రాగా ఇప్పడు మళ్లీ సిటీ ఫస్ట్‌ ప్లేస్‌కు వచ్చింది’ అన్నారు. 
 
ఇన్నోవేషన్‌ ఎకానమీలో ఇండియా ఫస్ట్‌ ప్లేస్‌లో కొనసాగుతుందని, టీఎస్‌ ఐపాస్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్నోవేషన్‌ ఎకానమీ పెరిగిందని చెప్పారు. ఆ కారణంగానే ఈ రోజు హైదరాబాద్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచిందన్నారు. సోషియో ఎకనమిక్‌ ఇండెక్స్‌లోనూ నగరం టాప్‌లో ఉందని చెప్పారు. నగరంలోని 40 శాతం జనాభా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లేనని, వారంతా ప్రొడక్టివ్‌ రంగంలో పనిచేస్తున్నారని అన్నారు.
 
భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలపై విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని జేఎల్‌ఎల్ ఇండియా కంట్రీ హెడ్‌, సీఈవో రమేశ్‌నాయర్‌ చెప్పారు. ఆర్థిక వృద్ధి తిరోగమనంలో ఉన్నా పారదర్శకమైన సంస్కరణలు తీసుకువస్తున్నారని, ఈ వాతావరణం రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు పెరిగేలా దోహదం చేస్తాయని తెలిపారు. 
 
సౌత్‌ ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం అసాధారణ వృద్ధి రేటును నమోదు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జేఎల్‌ఎల్‌ డైరెక్టర్‌ జెరెమీ కెల్లీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ రామ్మోహన్‌, ఐటీ, ఇండస్ట్రీస్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.